భారత ఆటగాళ్లకు మరో కొత్త టెస్ట్...

భారత ఆటగాళ్లకు మరో కొత్త టెస్ట్...

భారత జట్టు ఫిట్‌నెస్‌ని మరింత పెంచేందుకు బీసీసీఐ మరో కొత్త టెస్టును త్వరలోనే తీసుకువస్తోంది. అయితే ఈ టెస్ట్ ను ఏడాదికి మూడు సార్లు నిర్వహిస్తారట. ప్రస్తుతం భారత జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలంటే.. ఏ ఆటగాడు అయినా సరే తప్పనిసరిగా యో-యో ఫిట్‌నెస్ టెస్టులో పాసవ్వాల్సిందే. అయితే ఈ ఏడాది నుంచి బీసీసీఐ ఆ టెస్టుని మరింత కఠినతరం చేస్తోంది. ఇప్పటివరకు యో-యో ఫిట్‌నెస్ టెస్టులో ఓ క్రికెటర్‌ 17.1 పాయింట్లు సాధిస్తే చాలు. కానీ ఇప్పుడు కొత్తగా ఆటగాళ్ల వేగం, సహనానికి పరీక్ష పెట్టేందుకు ఓ టెస్టుని తెరపైకి తీసుకువస్తోంది. అదేంటంటే.. ఓ ఫాస్ట్ బౌలర్ 2 కిమీ దూరాన్ని 8 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాలి. అదే ఓ బ్యాట్స్‌మెన్‌ అయితే 8 నిమిషాల 30 సెకన్లలో పరుగు పెట్టాలి. బ్యాట్స్‌మెన్‌కు 15 సెకన్లు అదనపు సమయం ఇచ్చింది. ఏడాదిలో మూడు సార్లు ఈ టెస్టుని ఆటగాళ్లు పూర్తి చేయాల్సి ఉంటుందట. ఈ కొత్త ఫిట్‌నెస్ టెస్టు ప్రతిపాదనపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. బోర్డు సభ్యులతో చర్చలు జరుపుతున్నాడని సమాచారం.