ఆటగాళ్లు తమ తప్పును ఒప్పుకుంటే నిషేధం ఉండదు : బీసీసీఐ 

ఆటగాళ్లు తమ తప్పును ఒప్పుకుంటే నిషేధం ఉండదు : బీసీసీఐ 

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ ఆటగాళ్లకు ఒక చివరి అవకాశాన్ని ఇచ్చింది. ఆటగాళ్లు తమ తప్పును ఒప్పుకుంటే వారికి నిషేధం ఉండదు అని స్పష్టం చేసింది. అది ఏ విషయం లో అంటే... యువ ఆటగాళ్లు అండర్-19‌ వరల్డ్‌కప్‌లో ఆడేందుకు తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాల్ని బోర్డుకు అప్పగిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అలా చేసిన ఆటగాళ్లు ఎవరైనా ఉంటె తమంతట తామే ఒప్పుకోవాలని వచ్చే నెల 15 వరకు సమయం ఇచ్చింది. అలా గడువు లోపల ఒప్పుకున్న వారి పై ఎటువంటి నిషేధం ఉండదని అంతేకాకుండా వారు ఏ స్థాయి ఆటకు అర్హులో అందులోనే వారిని ఆడిస్తాము అని స్పష్టం చేసింది. 

అయితే ఒకవేళ ఆటగాళ్లను బోర్డు గుర్తిస్తే వారి పై రెండు సంవత్సరాలు నిషేధం విధించడమే కాకుండా రాష్ట్ర స్థాయి క్రికెట్ లో కూడా అనుమతించబోమని తెలిపింది. ఇక ఈ విధంగా తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో జరిగేవి. కానీ ఇప్పుడు ఆ కేసులు బీసీసీఐ లో కూడా నమోదవుతున్నాయి. ఈ మధ్యే ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరపున ఆడిన కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ రసిక్ సలామ్.. భారత అండర్-19 జట్టులో ఆడేందుకు తప్పుడు జనన ధ్రువీకరణ పత్రం సమర్పించి దొరికిపోయాడు. దాంతో అతనిపై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది.