తెలకపల్లి రవి : విద్యుచ్చక్తి పోరాటం, వినూత్న చైతన్యమే @ 20

తెలకపల్లి రవి : విద్యుచ్చక్తి పోరాటం, వినూత్న చైతన్యమే @ 20

తెలకపల్లి రవి

కొన్ని క్షణాలెప్పుడూ గతంలోకి జారవు.. కొన్ని ఘట్టాలెప్పటికీ ప్లాష్‌బాక్‌ లు  కావు..

భగత్‌ సింగ్‌ బలిదానంలా..బషీర్‌బాగ్‌ రణనాదంలా...

నూతన సహస్రాబ్ది ప్రారంభ సంవత్సరమైన 2000 ఆగష్టు 28 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను మలుపు తిప్పిన విద్యుత్తేజానికి సంకేతం. ఒక మహోజ్వల పోరాటం. విద్యుత్ ఉద్యమానికి ముందు తర్వాత అని విభజించవలసిన ప్రస్పుటమైన ప్రభావం ప్రసరించిన ప్రజాచైతన్య ప్రవాహం. 1999లో రెండవసారి ముఖ్యమంత్రి పదవి  చేపట్టి హైటెక్‌ పాకుడుగా సీఇవోగా తనను తాను చెప్పుకున్న చంద్రబాబు నాయుడు  విద్యుత్‌ బోర్డును  విభజించి ప్రైవేటీకరించి ప్రజలపై రాష్ట్రంపై భారాలు  విధించడానికి వ్యతిరేకంగా మొదలైంది ఈ ఉద్యమం. అప్పటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు క్రియాశీల నాయకత్వంతో  వామపక్షాల చొరవతో మొదలైన ఈ ఉద్యమంలో  కాంగ్రెస్‌ సహా అన్ని ప్రతిపక్షాలు పాలు పంచుకున్నాయి.   ప్రభుత్వం పోలీసులు బలగాలను ఆంక్షలను ప్రయోగించినా నిర్బంధనలను  తట్టుకుంటూ  విద్యుత్ ఉద్యమం విస్తరించింది. కొత్త కొత్త రూపాలు  ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లింది.  కొత్త తరం కమ్యూనిస్టులలో  సమరశీలత సన్నగిల్లుతున్నదన్న అపప్రథను  విద్యత్ ఉద్యమం పూర్వపక్షం చేసింది. పోరాటానికి పతాక స్థాయిగా ఆగష్టు28న చలో అసెంబ్లీ కార్యక్రమం ఒక సంచలనమైంది. బషీర్‌బాగ్‌ను జలియన్‌వాలాబాగ్‌ అనిపించింది. గుర్రాలతో తొక్కించడం, పోలీసు కాల్పుల  వర్షం కురిపించడం తీవ్ర ప్రతిఘటనకు దారితీశాయి. బాస్వామి, విష్ణువర్ధనరెడ్డి అక్కడికక్కడే తూటాకు  గురై  అసువుర్పించగా  తీవ్రంగా గాయపడిన రామకృష్ణ  కూడా తర్వాత కన్నుమూశారు. ఆ అమరవీరుల సంస్మరణార్థం బషీర్‌బాగ్‌లో ఒక స్మారక చిహ్నం నిర్మించబడింది. ఈ కాల్పులకు  నిరసనగా ప్రతిపక్ష నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డితో సహా ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో నిరాహారదీక్ష చేస్తే ఆ శిబిరంపైనా లాఠిచార్జి చేశారు. అప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా వున్న కెసిఆర్‌ నాడు కూడా ఈ నిర్బంధాన్ని ఖండించి  మొదటిసారి నిరసనలతో బయటకు వచ్చారు. ఆనాడు  లాఠీదెబ్బకు తూటాకు గురైన ఎందరో కార్యకర్తలకు పోరాట పాఠాలు నేర్చుకుని నేటికీ ఉద్యమాలలో ముందు నిలబడుతున్నారు. విద్యుచ్చక్తి ఉద్యమం  రాష్ట్రంలోనే గాక దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా గొప్ప ప్రభావం చూపించి ప్రపంచబ్యాంకు ప్రజావ్యతిరేక నమూనాపై ప్రజాఉద్యమాల నిర్మాణానికి స్పూర్తినిచ్చింది.ఈనాటికీ ప్రజలకు  ఏ సమస్య వచ్చినా వామపక్షాలే వాటిపై పోరాటానికి ముందుంటాయని  బలంగా విశ్వసిస్తూ అండదండలిస్తున్నారంటే ఆ వరవడి ఒక కారణం. ఆ  నేపథ్యంలోనే తర్వాత  కొద్ది కాలానికే ఆసియా సామాజిక వేదిక అంతర్జాతీయ సమావేశాలు  కూడా  హైదరాబాదులోనే జరిగాయి. క్షేత్రస్థాయి పోరాటానితో పాటు  మీడియాలోనూ సాహిత్య సాంసృతిక రంగాల్లోనూ ప్రత్యామ్నాయంను  ముందుకు తెచ్చి కొత్త ముద్రవేసింది. చంద్రబాబు పాలనపై ప్రజాగ్రహానికి అసంతృప్తికి అద్దం పట్టిన ఈ ఘట్టం తర్వాతనే ఒకవైపు కెసిఆర్‌ టిఆర్‌ఎస్  స్థాపిస్తే‌ , వైఎస్‌ఆర్‌ ప్రజాప్రస్థానం జరిపి తమ తమ రాజకీయ లక్ష్యాల వైపు నడిచారు.

ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో సూటిగా విద్యుత్‌ చార్జిలు  పెంచడానికి జంకుతున్న పాలకులు డొంకతిరుగుడుగా ప్రకటిస్తుంటారు. చార్జీలు బాగా పెంచి కొంచెం తగ్గించి రాజకీయ మల్లగుల్లాలు పడుతుంటారు. ఇప్పటికైనా ఎప్పటికైనా పోరాటాలు ఉద్యమాలతోనే పాలకుల పోకడలకు పగ్గాలు వేయడం సాధ్యమనే సందేశమే విద్యుత్ ఉద్యమం. అందుకే కరోనా కల్లోలంలోను ప్రజల పరిమితుల్లోనే ఉద్యమాలు సాగించడం చూస్తూనే వున్నాం. ఈనాడు మరోసారి కేంద్రం తెచ్చిన సరికొత్త జాతీయ విద్యుత్‌ విధానం మరోసారి విద్యుత్‌ వ్యవస్థను పూర్తిగా ప్రైవేటు పరం చేయడమే గాక రాష్ట్ర ప్రభుత్వాల  పాత్రను కూడా నామమాత్రం చేస్తున్నది. కేరళ, పంజాబ్,‌ తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఈ విదానంపై వ్యతిరేకతను ప్రకటించాయి. విమానాశ్రయాలు విమాన మార్గాలు టెలికాం, రైళ్లు గనుల రక్షణ ,అంతరిక్ష పరిశోధన అన్నిటిలోకి కార్పొరేట్లను రప్పించేందుకు మోడీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇలాంటి సమయంలో ప్రజాప్రయోజనాలను కాపాడుకోవడానికి విద్యుత్ ఉద్యమ వారసత్వమే మార్గదర్శకం కాగలదు.