తిరుపతిలో 'బండి' సాయం పట్టాల్సిందేనా?

తిరుపతిలో 'బండి' సాయం పట్టాల్సిందేనా?

తిరుపతిలో 'బండి' సాయం పట్టాల్సిందేనా? ఆయన వచ్చి.. లాస్ట్‌ పంచ్‌ ఇస్తే ప్లస్‌ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారా? సంజయ్‌ను పిలవడం వెనక ఉద్దేశం ఓట్ల పోలరైజేషనేనా?

పార్టీ ఆదేశిస్తే తిరుపతి ప్రచారానికి వెళ్తానని నాడే ప్రకటన!

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు బీజేపీ సమాయత్తం అవుతున్న సమయంలో హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన కామెంట్‌ ఇది. అప్పటికే GHMC ఎన్నికల ప్రచారంలో పాతబస్తీలోని రోహింగ్యాలపై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేస్తామన్న ఆయన కామెంట్స్‌ సంచలనం కావడంతో..  తిరుపతి ఉపఎన్నికపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కూడా పాపులర్‌ అయ్యాయి. పార్టీ ఆదేశిస్తే తప్పకుండా తిరుపతి ప్రచారానికి వెళ్తానని చెప్పారు. ఇప్పుడు తిరుపతి ప్రచారం వేడెక్కుతున్న సమయంలో బండి సంజయ్‌ ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. 

బండి వస్తే ప్రచారానికి టర్నింగ్‌ పాయింట్‌? 

తిరుపతిలో బండి సంజయ్‌ ప్రచారం చేస్తారని లీకులు బయటకొచ్చాయి. ఏప్రిల్‌ 14న ఆయన టూర్‌ చేస్తారని.. రెండురోజులపాటు ఆయన ప్రచారం ఉంటుందని చెబుతున్నారు. ఢిల్లీ పెద్దలు కూడా బండి వెళ్లి తిరుపతిలో సాయం పట్టాలని చెప్పినట్టు చర్చ జరుగుతోంది. ఏపీ బీజేపీ నేతలు కూడా తమ ఫైర్‌ బ్రాండ్‌ ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారట. దుబ్బాక, GHMC ఎన్నికల్లో బీజేపీకి క్రేజ్‌ రావడానికి బండి మాటలే కారణమని పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. దానికితోడు అప్పట్లో భగవద్గీత పార్టీ కావాలో.. బైబిల్‌ పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలు జనాల్లోకి బాగానే వెళ్లినట్టు కమలనాథులు లెక్కలేసుకుంటున్నారు. అందుకే తిరుపతి ప్రచారానికి బండి సంజయ్‌ వస్తే అది పార్టీకి టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని చర్చించుకుంటున్నారట. 

నాగార్జునసాగర్‌లోనూ సంజయ్‌ ఫోకస్‌!

ఇక్కడో సమస్య ఉంది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికతోపాటే తెలంగాణలోని నాగార్జునసాగర్‌ అసెంబ్లీకి కూడా ఉపఎన్నిక అదే రోజు జరుగుతోంది. సాగర్‌లో కూడా సంజయ్‌ ఫోకస్‌ పెట్టాల్సి ఉంది. పార్టీ పరంగా ఆ ఎన్నిక కూడా కీలకమే. పైగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను, కాంగ్రెస్‌ నేత జానారెడ్డిని ఢీకొడుతున్నారు. పార్టీ టికెట్‌ ఆశించిన వారు బీజేపీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సాగర్‌లో బీజేపీకి పోటీలో నిలబెట్టాలి. పైగా.. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి చేదు ఫలితాలు వచ్చాయి. ఆ ఓటమిని అధిగమించేలా సాగర్‌లో ఫైట్‌ ఇవ్వాలి. అందుకే తిరుపతి ప్రచారానికి ఏ విధంగా సమయాన్ని అడ్జెస్ట్‌ చేస్తారన్నది ఒక ప్రశ్న. 

చివర్లో వచ్చి లాస్ట్‌ పంచ్‌ ఇవ్వాలని ఆశిస్తున్నారా? 

తిరుపతి, నాగార్జునసాగర్‌లో ఏప్రిల్‌ 15తో ప్రచారం ముగుస్తుంది. రెండు చోట్ల ఇప్పుడిప్పుడే ప్రచారం గేరప్‌ అవుతోంది. ఒకవేళ బండి ముందే వచ్చేస్తే ఆ వేడిని కొనసాగించడం కష్టమనే అనుకుంటున్నారట. అందుకే ప్రచారం చివర్లోవచ్చి.. లాస్ట్‌ పంచ్‌ ఇస్తే ఆ ప్రభావం పోలింగ్‌ తేదీ వరకు ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. సంజయ్‌ వస్తే ఇంకెలాంటి వ్యాఖ్యలు చేస్తారో.. ఎలాంటి హీట్‌ పుట్టిస్తారో అన్న ఉత్కంఠ కూడా కమలనాథుల్లో ఉంది. మరి.. సంజయ్‌ తిరుపతి వెళ్తారో లేదో చూడాలి.