కోరిన కోర్కెలు తీరాలా ? అయితే ఆ ఊరి గుడికి అరటి గెలతో వెళ్ళాల్సిందే !

కోరిన కోర్కెలు తీరాలా ? అయితే ఆ ఊరి గుడికి అరటి గెలతో వెళ్ళాల్సిందే !

కోరిన కోర్కెలు తీరాలనుకంటున్నారా....కష్టాలు తొలగిపోవాలని భావిస్తున్నారా....ఎల్లవేళల సంతోషంగా జీవించాలని అనుకుంటున్నారా....అయితే ఓ అరటి పళ్ళ గెల తీసుకుని శ్రీకాకుళం జిల్లాలోని ఆ గ్రామానికి వెళ్లండి.  ఇక్కడ కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన పందిరికి ఆ గెలను కట్టి కోరికలు కోరుకోండి. అంతే  కోరిన కోర్కెలు నెరవేరుతాయి. నమ్మలేకపోతున్నారా నిజమండి బాబు . ఆ దేవుడి పై ఎంతో నమ్మకంతో తలా ఓ అరటిగెల కట్టేసి భక్తులు ప్రతి ఏడాది పండుగను జరుపుకుంటుంటారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో చెట్లతాండ్ర గ్రామం ఇది.

ఈ గ్రామంలో ఓ విశేషం ఉంది. ఇక్కడ ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి ఏడాది భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పండుగ జరుగుతుంది. ఇక్కడ వెలసిన స్వామిని దర్శించుకుని ఆలయం ఎదురుగా ఉన్న రావి చెట్టు ప్రక్కన వేసిన పందిళ్ళకు అరటి గెలలు నైవేధ్యంగా పెట్టి కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా అంతే నమ్మకంతో జిల్లా నలుమూలల నుంచి భీష్మ ఏకాదశి రోజున చెట్లతాండ్ర గ్రామానికి అరటి గెలలతో వేలసంఖ్యలో తరలివచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. 

ఈ ఆచారం వెనుక ఓ కథ :

వింతైన ఈ ఆచారం వెనుక ఓ కథ ఉంది. రెండువందల ఏళ్ల క్రితం గ్రామంలో ఒక స్వామీజీ ఉండే వారు. ఆయన గ్రామంలో ఉంటూ అక్కడ గ్రామస్థులకు వైద్యం చేసేవాడు. అలా డబ్బై ఏళ్ల పాటు గ్రామంలో వైద్యం చేసిన స్వామీజీ కొన్నాళ్ల తర్వాత పరమపదించారు. ఐతే స్వామీజీ పరమపదించిన తర్వాత గ్రామంలో ఓ రావిచెట్టు వెలిసింది. అప్పటి నుండి ఇక్కడ గ్రామస్థులు రావి చెట్టును స్వామీజీ స్వరూపంగా భావించి పూజించడం ప్రారంభించారు. ఇలా రావిచెట్టు మనసులో కోరుకున్న కోర్కెలు తీర్చేస్తుండటంతో ఆ రావి చెట్టుకు అరటి గెలలు పెట్టి పూజిస్తున్నారు ఇక్కడ గ్రామస్తులు. స్వామీజీ సజీవంగా ఉన్నంత కాలం అరటి పళ్లను మాత్రమే తినేవారట. అందుకే ఆయనకు అందరూ అరటిపళ్లను ప్రసాదంగా పెడుతున్నారమంటున్నారు గ్రామస్తులు.

పందిళ్ళ వెనుక కధ : 

ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు అరటి గెలలు రావి చెట్టు వద్ద పెట్టి ఏదైనా కోరుకుంటే,ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందని భక్తుల నమ్మకం. అయితే ప్రతి ఏడాది రావి చెట్టు చుట్టూ అరటి గెలలు కట్టేస్తుండడంతో అక్కడ స్థలాభావ సమస్య తలెత్తడంతో గ్రామస్తులు రావి చెట్టుకు ఆనుకుని పెద్ద పందిర్లను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. దీంతో భక్తులు వారు తీసుకువచ్చిన అరటిగెలలను ఓ క్రమ పద్దతిలో పందిర్లకి కట్టి కోర్కెలు కోరుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. కొందరు ముందే లక్ష్మీనరసింహ స్వామిని మొక్కుకుని గెలలు కడితే మరికొందరు కోరిన కోర్కెలు నెరవేరిన తర్వాత గెలలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇలా కట్టిన గెలలకు ఆలయ కమిటీ ప్రతినిధులు నంబరింగ్ ఇస్తారు . మరునాడు అక్కడి మళ్ళీ వెళ్లి స్లిప్ చూపిస్తే వారు కట్టిన గెలను తిరిగి ప్రసాదంగా ఇస్తారు. ఆ గెలలను ఇంటికి తీసుకువచ్చి భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు. బందువులకు స్నేహితులకు కూడా పంచి పెడుతుంటారు. ప్రతి ఏడాది చెట్ల తాండ్రలో భీష్మ ఏకాదశి రోజున ఈ పండుగ సంప్రదాయ బద్ధంగా జరుగుతుంది. చెట్లతాండ్ర గ్రామస్తులే కాకుండా చుట్టు ప్రక్కల గ్రామాల వారు కూడా ఇదే ఆనవాయితీని పాటిస్తున్నారు.