ఎన్నికలకు ముందు తీర్పు రానట్లే..

ఎన్నికలకు ముందు తీర్పు రానట్లే..

అయోధ్యలోని వివాదాస్పద స్థలం విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ కోరుతూ ఇవాళ విచారణకు వచ్చిన కేసును రంజన్ గొగోయి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జనవరికి వాయిదా వేసింది. ఈ కేసును జనవరి మొదటివారానికి వాయిదా వేసిన బెంచ్.. అది కూడా జనవరిలో విచారణ కాకుండా.. విచారణ ఎప్పుడు జరపాలో తేదీ నిర్ణయిస్తామని చెప్పింది. అది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్.. ఎప్పుడైనా కావచ్చని కోర్టు పేర్కొంది. దాంతోపాటు అప్పుడు ఏర్పడే కొత్త ధర్మాసనమే కేసును విచారిస్తుందని కూడా కోర్టు స్పష్టం చేసింది. 

ఇక ఈ కేసులో యూపీ ప్రభుత్వం కౌన్సెల్ గా ఉన్న తుషార్ మెహతా.. కేసును త్వరగా తేల్చాలని కోరారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా త్వరగా తేల్చాలని కోర్టును కోరింది. దానికి తీర్పు రాసిన జడ్జి చిరునవ్వుతో మాత్రమే బదులిచ్చారు. మరోవైపు స్థల వివాదానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహీ అకాడా కౌన్సెల్ కూడా కేసును త్వరగా తేల్చాలని కోరడం విశేషం. 

కేసు వాయిదా దరిమిలా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు గానీ, 2019 సార్వత్రిక ఎన్నికల ముందు గానీ అయోధ్య వివాదంలో తీర్పు వచ్చే అవకాశం లేనట్లేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేసు విచారణ ఎప్పుడు చేపడతారనే తేదీని జనవరిలో ప్రకటిస్తామని, ఆ తేదీ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్.. ఎప్పుడైనా కావొచ్చని కోర్టు వ్యాఖ్యానించడంతో.. ఈ అభిప్రాయాలకు అవకాశం ఇచ్చినట్లయింది. 

2010 నాటి తీర్పులోని ఉద్దేశాలను, వ్యాఖ్యానాలను తరచి చూడాలని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు ప్రాంతంలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రాంలల్లా, సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌, నిర్మొహీ అఖాడా మధ్య పంచుతూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై కోర్టు విచారించాల్సి ఉంది.