ఆగస్టులో రామ మందిర నిర్మాణం ప్రారంభం

ఆగస్టులో రామ మందిర నిర్మాణం ప్రారంభం

శ్రీరాముడు భారతీయులకు ఆదర్శం. అందుకే రాముడి గుడి లేని ఊరుండదు. అయితే, రాముడు జన్మస్థలమైన అయోధ్యలో రాముడికి గుడి లేకపోవడం బాధాకరమే. రామ మందిరాన్ని కూల్చి అక్కడ బాబ్రీమసీదు కట్టడంతో ఆ స్థలంపై హక్కు కోసం సుదీర్ఘ న్యాపోరాటం జరిగింది. చివరికి పురాణ గాథలు, చారిత్రక ఆధారాలతో రామాలయ ట్రస్ట్‌కు భూమిని కట్టబెట్టింది సుప్రీం కోర్టు. అయోధ్యలోని సుమారు 67 ఎకరాల విస్తీర్ణంలో రామ మందిరం నిర్మితం కాబోతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద రామాలయం కానుంది. 

రామమందిరం నిర్మాణం మీద ఈ సాయంత్రం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆగస్టులోనే భూమిపూజ నిర్వహించాలని తీర్మానించారు. ప్రధాని మోడీ భూమిపూజ చేయనున్నట్లు చెబుతున్నారు. ప్రధాని వీలును బట్టి ఆగస్టు 3న లేదా 5వ తేదీన భూమి పూజకు సన్నాహాలు చేస్తున్నారు. అయోధ్య రామమందిరం ప్రాంతంలో ప్రధాని మోడీ మొదటి పర్యటన ఇదే.  

ఇక కొత్తగా నిర్మించబోయే రామ మందిరం  ఎత్తు 128  అడుగులు. వెడల్పు 140 అడుగులు. పొడవు 270 అడుగులుగా ఉంటుంది. రామాలయాన్ని మొత్తం రెండంతస్తుల్లో చేపట్టేలా ప్లాన్‌ సిద్ధంగా ఉంది. మొదటి అంతస్తులోనే  శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇక ఆలయ పైభాగాన శిఖరం ఉంటుంది. ఒక్కో అంతస్తులో 106 స్తంభాలు చొప్పున మొత్తం 212  స్తంభాలు ఉంటాయి. అయితే... ఈ ప్లాన్‌కు  జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కొన్ని మార్పులు సూచించినట్టు తెలుస్తోంది. గుడి ఎత్తుని 128 అడుగులు కాకుండా 160 అడుగులకు పెంచాలని భావిస్తోంది.