రేపు అయోధ్య కేసు విచారణ

రేపు అయోధ్య కేసు విచారణ

అయోధ్య వివాదాస్పద భూమి కేసు శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అత్యున్నత న్యాయస్థానం వెబ్ సైట్ లో ఈ మేరకు ఒక నోటీస్ పోస్ట్ చేయడం జరిగింది. నోటీస్ ప్రకారంచ ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇందులో సీజేఐ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీ.వై. చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉన్నారు. మధ్యవర్తిత్వ ప్యానెల్ కు ఈ వ్యవహారం అప్పజెప్పిన తర్వాత మొదటిసారి ఈ కేసుపై విచారణ జరుగుతోంది. 

మధ్యవర్తిత్వ ప్యానెల్ తన రిపోర్ట్ ను సమర్పించడం జరిగింది. రామ మందిరం-బాబ్రీ మసీదు వివాదం కేసును పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ ప్యానెల్ లో రిటైర్డ్ జస్టిస్ ఖలీఫుల్లా, న్యాయవాది శ్రీరామ్ పాంచూ, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ ఉన్నారు.

కొన్నాళ్ల క్రితం ఈ వ్యవహారంలో పిటిషన్ దాఖలు చేసిన 25 మంది మధ్యవర్తిత్వ ప్యానెల్ ముందు హాజరయ్యారు. పిటిషనర్లతో పాటు వారి తరఫు న్యాయవాదులు కూడా ఉన్నారు. వీరందరినీ ఫైజాబాద్ యంత్రాంగం తరఫున నోటీసులు పంపడం జరిగింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ ఫైజాబాద్ లోని అవధ్ యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎవరినీ ఆ వైపు వెళ్లడానికి అనుమతించలేదు.

అయోధ్యలోని వివాదాస్పద భూమిలో పూజలు జరిపేందుకు అనుమతించాలని ఏప్రిల్ లో దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్ట్ తిరస్కరించింది. మీరు ఈ దేశాన్ని శాంతిగా ఉండనివ్వరని పిటిషనర్లపై మండిపడింది. ఏదో ఒకటి రెచ్చగొడుతూ ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లకు అలహాబాద్ హైకోర్ట్ రూ.5 లక్షల జరిమానా విధించింది. ఆ జరిమానాను రద్దు చేయడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది.