టీ విరామానికి భారత్ స్కోర్ 86/2

టీ విరామానికి భారత్ స్కోర్ 86/2

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీ విరామ సమయానికి భారత్ ఓపెనర్లు పెవిలియన్ చేరారు. దీంతో ఓపెనర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ పరుగులు చేయలేక విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ ఫర్వాలేదనిపించినా.. విజయ్ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. మూడో రోజైన శనివారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌ మురళీ విజయ్‌ (18; 53 బంతుల్లో) తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. రాహుల్ మాత్రం ఆచితూచి ఆడుతూ 44 (67 బంతుల్లో 3x4, 1x6) పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. టీ విరామ సమయానికి టీంఇండియా 2 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో చతేశ్వర్ పుజారా (11), కెప్టెన్ విరాట్ కోహ్లి (2)లు ఉన్నారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్, హేజిల్ వుడ్ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని.. ప్రస్తుతం టీంఇండియా 101 ఆధిక్యంలో ఉంది.