రాఫెల్ పత్రాల చోరీకి యత్నం!!

రాఫెల్ పత్రాల చోరీకి యత్నం!!

భారత్ కొనుగోలు చేసిన 36 రాఫెల్ యుద్ధ విమానాల తయారీని పర్యవేక్షిస్తున్న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లోని భారత వాయు సేన కార్యాలయంలోకి చొరబడే యత్నం జరిగింది. రాఫెల్ తయారీ సంస్థ దస్సాల్ట్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్యారిస్ శివార్లలో ఉన్న ఐఏఎఫ్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ టీమ్ కార్యాలయంలోకి ఆదివారం చొరబడేందుకు విఫల యత్నం జరిగిందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఇది గూఢచర్యానికి ప్రయత్నమా అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. గూఢచర్యమే అయితే ఐఏఎఫ్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. 

ఐఏఎఫ్ లోని గ్రూప్ కెప్టెన్ హోదా అధికారి నేతృత్వంలోని భారత ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ బృందం ప్యారిస్ లో ఉంది. దస్సాల్ట్ ఏవియేషన్ నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న 36 రాఫెల్ ఫైటర్ జెట్ల తయారీని ఈ బృందం దగ్గర ఉంది పర్యవేక్షిస్తోంది. భారత సిబ్బంది ఇక్కడ శిక్షణ కూడా పొందుతున్నారు. 

ఈ సంఘటన గురించి భారత వాయు సేన సిబ్బంది ఇప్పటికే ఢిల్లీలోని రక్షణ మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు. దీనిపై రక్షణ మంత్రిత్వశాఖ, ఐఏఎఫ్, ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.