సిక్కోలులో జనసేన కార్యకర్త మీద దాడి.. మంత్రి తమ్ముడి మీద అనుమానాలు ?

సిక్కోలులో జనసేన కార్యకర్త మీద దాడి.. మంత్రి తమ్ముడి మీద అనుమానాలు ?

శ్రీకాకుళం జిల్లాలో మంత్రి సీదిరి అప్పలరాజు స్వగ్రామం దేవునల్తాడలో ఫేస్ బుక్ పోస్టింగ్స్ వ్యవహారం  వివాదానికి దారి తీసింది. ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళ్తే జనసేన పార్టీకి చెందిన పరపతి పద్మారావు అనే కార్యకర్త ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టులకు వైసీపీ వర్గీయుల నుంచి ఘాటైన సమాధానం వచ్చింది.  అదే సమయంలో ఆ ఫేస్ బుక్ పోస్ట్ కి మంత్రి అప్పలరాజు సోదరుడు చిరంజీవి కూడా కామెంట్ చేయడంతో ఈ మాటల యుద్ధం శృతి మించింది. ఈక్రమంలో ఘాటైన పదాలతో మెసేజ్ లు పెట్టుకోడంతో జనసేన కార్యకర్తను ఇంటికొచ్చి తంతానంటూ మంత్రి అప్పలరాజు సోదరుడు పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే జనసేన కార్యకర్త పద్మారావు పై దాడి జరిగగడం సంచలనంగా మారింది. సుమారు 30 మందికి పైగా అతని పై దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఒళ్లంతా వాతలు తేలేలా కొట్టారని తల పై బలంగా కొట్టడంతో తలకు గాయమైందని చెబుతున్నారు. గాయాల పాలైన పద్మారావును పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఫేస్ బుక్ పోస్టింగ్ విషయంలోనే తన పై మంత్రి అప్పలరాజు సోదరుడు చిరంజీవి , మరో 30 మంది కలిసి దాడి చేశారని పద్మారావు ఆరోపిస్తున్నాడు. మరో వైపు పద్మా రావు పై జరిగిన దాడిని జనసేన పార్టీ నాయకులు , శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి.