రాజ‌స్థాన్ సంక్షోభానికి శుభంకార్డు..! నేడు గెహ్లాట్, పైల‌ట్ భేటీ

రాజ‌స్థాన్ సంక్షోభానికి శుభంకార్డు..! నేడు గెహ్లాట్, పైల‌ట్ భేటీ

రాజ‌స్థాన్‌లో మొద‌లైన రాజ‌కీయ సంక్షోభానికి తెర‌దించే ప్ర‌య‌త్నం చేసింది కాంగ్రెస్ అధిష్టానం... ఇక‌, తిరుగుబాటు చేసినా వృథా అని భావించిన స‌చిన్ పైల‌ట్ కూడా రాజీకి వ‌చ్చార‌ని విశ్లేష‌కులు చెబుతున్న‌మాట‌.. మ‌రోవైపు.. తిరుబాటుతో ఇన్ని రోజుల పాటు ఎడ మొహం పెడ మొహంగా ఉన్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్.. ఇవాళ స‌మావేశం కానున్నారు. శాసన సభా పక్ష సమావేశం దీనికి వేదిక‌కానుంది. ఇక‌, ఈ నెల 14న రాజ‌స్థాన్ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభంకానున్నాయి. 

మ‌రోవైపు... స‌చిన్ పైల‌ట్ వ‌ర్గం తిరుగుబాటుతో బ‌ల‌నిరూప‌ణ‌కు సిద్ధ‌మైన సీఎం అశోక్ గెహ్లాట్.. పైలట్ సొంత గూటికి వచ్చినా... సరే బలపరీక్షకే మొగ్గు చూపుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎక్కువ కాలం ఎమ్మెల్యేలను రిసార్టుల్లో ఉంచడం సాధ్యమయ్యే పని కాదని భావిస్తున్న నేత‌లు.. దీనిపై తుది నిర్ణయం మాత్రం ఈ నెల 14 న తీసుకుంటారని తెలుస్తోంది. ఇక‌, ఇప్ప‌టికే.. స‌చిన్ పైల‌ట్ పై అశోక్ గెహ్లాట్... ఆయ‌న వ్యాఖ్య‌ల‌తో పైల‌ట్ నొచ్చుకోవ‌డం లాంటి ప‌రిణామాలు జ‌రిగిన నేప‌థ్యంలో ఇవాళ్టి భేటీ ఎలా జ‌ర‌గ‌బోతోంది? అనే ఆస‌క్తి నెల‌కొంది.