పుల్వామాలో ఎదురు కాల్పులు...ఆర్మీజవాను మృతి

పుల్వామాలో ఎదురు కాల్పులు...ఆర్మీజవాను మృతి

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ఓ ఉగ్రవాది హతమవ్వగా, ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. పుల్వామా జిల్లాలోని కంరాజీపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రతాదళాలు బుధవారం తెల్లవారుజామున గాలింపు చేపట్టాయి. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. జవాన్‌ను ఆస్పత్రికి తరలించగా, అతడు మరణించాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మిగిలినవారు తప్పించుకున్నారని, వారికోసం గాలింపు కొనసాగుతున్నదని పోలీసులు వెల్లడించారు. మరణించిన ఉగ్రవాది ఏ సంస్థకు చెందినవాడనే విషయం గుర్తించాల్సి ఉందని భద్రతా దళాలు పేర్కొన్నాయి.