అధికార పార్టీలో వర్గ విభేదాలే కార్పొరేటర్‌పై దాడికి కారణమా?

అధికార పార్టీలో వర్గ విభేదాలే కార్పొరేటర్‌పై దాడికి కారణమా?

కార్పొరేటర్‌పై దాడి వెనక రాజకీయాలు ఉన్నాయా? అధికార పార్టీలోని వర్గ విభేదాలే దాడికి కారణమా? అదనుచూసి వేటు వేశారా? లేక వేటు వేసి పెద్దోళ్లు సేఫ్‌ అయ్యారా? ఇంతకీ ఈ ఘటన వెనక ఉన్నది ఎవరు? ఖమ్మం జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? 

మంత్రి పువ్వాడ శిబిరంలో ఉన్న కార్పొరేటర్‌ రామ్మూర్తి !

ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మొదటి డివిజన్‌ కార్పొరేటర్‌ రామ్మూర్తి నాయక్‌పై దాడి.. ఆయన కారును దగ్ధం చేయడం మీద టీఆర్‌ఎస్‌లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వర్గ, ఆధిపత్య పోరులో భాగంగానే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని సమాచారం. ఒకటో డివిజన్‌ సాంకేతికంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్నా.. పాలేరు అసెంబ్లీ నియోజవర్గంలో ఉంటుంది. అందుకే ఎప్పుడూ నేతల మధ్య పంచాయితీలు కాక రేపుతాయి. తాజా ఘర్షణలో సెంటర్‌ పాయింట్‌గా ఉన్న కార్పొరేటర్‌ రామ్మూర్తి నాయక్‌ నాడు కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మేయర్‌ పదవి ఆశించారు. అయితే అది దక్కలేదు.  ప్రస్తుతం మంత్రి పువ్వాడ అజయ్‌ శిబిరంలో ఆయన యాక్టివ్‌గా ఉన్నారు.   అయినప్పటికీ  తాజా ఘటనలో కార్పొరేటర్‌ రామ్మూర్తి నాయక్‌ను సస్పెండ్‌ చేయడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మంత్రి పువ్వాడకు తెలిసి వేటు వేశారా లేక ప్రత్యర్థులు పావులు కదిపారా అన్న చర్చ జరుగుతోంది. 

రామ్మూర్తిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించిన కందాల వర్గం నేత వేణు!

కార్పొరేటర్‌ రామ్మూర్తికి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి వర్గంతో అస్సలు పడదు. ఆ వర్గంతో డీ అంటే డీ అంటారు. అందుకే ఎమ్మెల్యే వర్గం ఆయన్ని టార్గెట్‌ చేసిందని పార్టీలో ఓ వర్గం భావిస్తోంది. రామ్మూర్తి నాయక్‌ ఫంక్షన్‌ హాల్‌లో చనిపోయిన ఆనంద్‌ కుటుంబాన్ని కందాల వర్గం పరామర్శించడం వెనక కూడా అదే రాజకీయం ఉంటుందని చెప్పుకొంటున్నారు. తనపై దాడికి టీఆర్‌ఎస్‌లో ఉన్నవారే కారణమని రామ్మూర్తి సైతం ఆరోపించారు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రామ్మూర్తి కామెంట్‌ చేశారో లేదో అలా కార్పొరేటర్‌పై వేటు వేస్తున్నట్లు పాలేరు ఎమ్మెల్యే కందాల ముఖ్య అనుచరుడు బెల్లం వేణు ప్రకటన చేశారు. అయితే తనను సస్పెండ్  చేయాలంటే మంత్రి పువ్వాడ ప్రకటన చేయాలి గానీ.. సంబంధంలేని వారు ఎలా చర్యలు తీసుకుంటారని  ప్రశ్నిస్తున్నారయన. 

మంత్రి పువ్వాడ కార్పొరేటర్‌ను వేనకేసుకొస్తారా? 

తాజా ఘటనలో కందాల వర్గం రెచ్చగొట్టడం వల్లే స్థానికులు హింసాత్మక చర్యలకు దిగారన్నది రామ్మూర్తి  ప్రధానంగా చేస్తోన్న ఆరోపణ. పైగా ఓ ACP, ఇద్దరు CIలు ఘటనా స్థలంలోనే ఉన్నా తనపై దాడి చేశారంటే  పెద్దల హస్తం లేకుండా జరగబోదని ఆయన అనుమానిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే కందాల మంత్రి పువ్వాడ మధ్య పడదని అంటారు. అందుకే ఈ ఎపిసోడ్‌లో  కార్పొరేటర్‌ను మంత్రి పువ్వాడ  వెనకేసుకొస్తారో లేదో అన్న చర్చ మొదలైంది. మరి.. ఈ వివాదం నేతల మధ్య ఆధిపత్యానికి దారితీస్తుందో.. లేక వేటు వేసి పెద్దోళ్లు తప్పించుకుంటారో చూడాలి.