ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ..సీట్ల కుదింపు..ఆన్‌లైన్‌లో మాత్రమే !

ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ..సీట్ల కుదింపు..ఆన్‌లైన్‌లో మాత్రమే !

సుదీర్ఘ విరామం తర్వాత నేటి నుండి ఏపీఎస్‌ఆర్టీసీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.  కేంద్రం సడలింపులు ఇవ్వడంతో అందులో భాగంగా ఆర్టీసీ సర్వీసులకు అనుమతినిచ్చింది ఏపీ సర్కార్. ఇటు కరోనా కారణంగా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది అన్ని డిపోల్లో బస్సులను పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ చేశారు. సోషల్ డిస్టెన్స్‌ పాటించేలా సిటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడుగంటల వరకూ సర్వీసులు నడుస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1500 బస్సులు రోడ్డెక్కనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

అయితే విశాఖ, బెజవాడలో సిటీ బస్సులను మాత్రం ఇంకా ప్రారంభించడం లేదు. అంతర్రాష్ట్ర సర్వీసుల విషయంలో ఆయా రాష్ట్రాల అనుమతి కోసం లేఖలు ఇప్పటికే రాశారు. అనుమతులు వచ్చాక అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అటు ఏ రోజుకు ఆ రోజు బుకింగ్ చేస్తే, వాటికి రిజర్వేషన్‌ చార్జీలు వసూలు చేయడం లేదు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, గూగుల్ పే లాంటి అన్ని రకాల వ్యాలెట్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 65 ఏళ్ళు దాటిన వాళ్ళు, 10 ఏళ్ల లోపు పిల్లలను అత్యవసరమైతేనే ప్రయాణానికి అనుమతిస్తామంటున్నారు అధికారులు.  

సూపర్ లగ్జరీ బస్సుల్లో సీట్లను కుదించిన అధికారులు.. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో  మార్క్ చేశారు. ప్రతి ఒక్క ప్రయాణికుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. బస్‌స్టాండ్లలో పది రూపాయలకు మాస్కులను విక్రయిస్తున్నారు. డిపో నుంచి డిపోకు మాత్రమే ఏపీ ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. భౌతిక దూరం పేరిట ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కుదింపు చేపట్టారు, పల్లెవెలుగులో 56 సీట్లకు బదులు 35, ఎక్స్‌ప్రెస్‌లో 30కి బదులు 20 సీట్లు అల్ట్రా డీలక్స్‌లో 40కి బదులుగా 29, సూపర్‌డీలక్స్‌లో 36కి బదులు 26 సీట్లు మాత్రమే ఉండనున్నాయి. ఇక ఏపీలో మొత్తం 436 రూట్లలో బస్సు సర్వీసులు నడవనున్నాయి. రాత్రిపూట సర్వీసులకి అనుమతి లేదు అయితే దూరప్రాంతాలకు మాత్రమే రాత్రిపూట సర్వీసులు నడవనున్నాయి.