సరికొత్త యాపిల్ ఉత్పత్తుల విడుదల.. ఫీచర్లు, ధరలివే

సరికొత్త యాపిల్ ఉత్పత్తుల విడుదల.. ఫీచర్లు, ధరలివే

టెక్ దిగ్గజ కంపెనీ యాపిల్ ఈ ఏడాది తన రెండో అతిపెద్ద హార్డ్ వేర్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది. సరికొత్త మాక్ బుక్ ఎయిర్, మాక్ మినీ, ఐప్యాడ్ ప్రోలను సగర్వంగా లాంచ్ చేసింది. ఈ ఈవెంట్ న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ లో జరిగింది. ఈ సారి కంపెనీ తన ఉత్పత్తుల్లో ఐఫోన్ లో ఇచ్చినట్టుగా ఎక్స్ ట్రా సెక్యూరిటీ కోసం ఫేస్ ఐడీ ఫీచర్ ఇవ్వడాన్ని విశేషంగా చెబుతున్నారు.

తన కొత్త మ్యాక్ బుక్ ఎయిర్ ధరను 1,199 డాలర్లు (సుమారు రూ.88,200)గా యాపిల్ ప్రకటించింది. 2010 తర్వాత డిజైన్ లో మార్పు లేని మాక్ బుక్ ఎయిర్ ను 2018లో పూర్తిగా మార్చేసింది. ఇందులో మొట్టమొదటిసారి 13.3 అంగుళాల రెటీనా డిస్ ప్లే ప్రవేశపెట్టారు. కీ బోర్డులో ఒక కీగా టచ్ ఐడీ ఇవ్వడం మరో హైలైట్. ఇది కంపెనీ టీ2 చిప్ పై పని చేస్తుంది. ఇందులో ఎస్ఎస్డీ కంట్రోలర్, ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ వంటి కీలక భాగాలను అమర్చారు. బేస్ మోడల్ 8జీబీ ర్యామ్ (అప్ టు 16జీబీ)తో వస్తుంది. ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ (1.6 గిగాహెర్ట్జ్ బేస్ క్లాక్, టర్బో 3.6 గిగాహెర్ట్జ్), 128జీబీ ఎస్ఎస్డీ (అప్ టు 1.5 టీబీ)గా ఉండనుంది.యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ బరువు 2.75 పౌండ్లు మాత్రమే. అంటే మునుపటి మ్యాక్ బుక్ తో పోలిస్తే క్వార్టర్ పౌండ్ తగ్గింది. యాపిల్ కొత్త మ్యాక్ బుక్ ఎయిర్ లో ఐట్యూన్స్, మూవీ ప్లేబ్యాక్ కోసం 13 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చారు. కొత్త మ్యాక్ మినీ ధర 799 డాలర్లు (దాదాపు రూ.58,800)గా నిర్ణయించింది.

కంపెనీ ఐప్యాడ్ ప్రోని 11 అంగుళాలు, 12.9 అంగుళాల డిస్ ప్లే ఆప్షన్ తో ప్రవేశపెట్టింది. ఇందులో హోమ్ బటన్ అమర్చారు. ఇందులో రెటీనా డిస్ ప్లే ఆప్షన్ ఇచ్చారు. పాత ఐప్యాడ్ తో పోలిస్తే కొత్త ఐప్యాడ్ ప్రో బాగా సన్నగా ఉంది. ఇది యాపిల్ A12x Bionicతో వస్తోంది.  A12x చిప్ సెట్ న్యూరల్ ఇంజన్, టైప్-సీ కనెక్టర్ తో పనిచేయనుంది. కొత్త ఐప్యాడ్ ప్రోలో 1టీబీ స్టోరేజీ ఇస్తున్నారు. ఐప్యాడ్ ప్రారంభ ధర 999 డాలర్లు (రూ.73,500). ఐప్యాడ్ ప్రో 11 అంగుళాల వేరియంట్ 799 డాలర్లకు (రూ.58,800), 12.9 అంగుళాల వేరియంట్ ధర 999 డాలర్లు (రూ.73,500) లభించనున్నాయి.

వీటితో పాటుగా కంపెనీ యాపిల్ పెన్సిల్ ను కూడా ప్రవేశపెట్టింది. ఈ యాపిల్ పెన్సిల్ ఐప్యాడ్ ప్రోతో మేగ్నటికల్లీ అటాచ్ అయి ఉండి ఎప్పుడు చార్జ్ అవుతుంది. వీటి ప్రీఆర్డర్ బుకింగ్ ఇవాళ్టి నుంచే ప్రారంభం అవుతాయి. నవంబర్ 7 నుంచి షిప్పింగ్ మొదలవుతుంది.