'నమ్మకద్రోహం చేసి.. ఏపీకి వచ్చి ఏం చేస్తారు..?'

'నమ్మకద్రోహం చేసి.. ఏపీకి వచ్చి ఏం చేస్తారు..?'

ప్రధాని నరేంద్ర మోడీ... ఏపీ పర్యటనపై ఆరోపణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి... ఇవాళ మోడీకి ఏపీ టీడీపీ చీఫ్, మంత్రి కళా వెంకట్రావ్‌ ఘాటుగా బహిరంగలేఖ రాశారు. రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసిన నరేంద్ర మోడీ... రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తారు.? అని ప్రశ్నించారు కళా వెంకట్రావ్.. రాజధానికి శంకుస్థాపన కోసం వచ్చి గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు మాత్రమే ఇచ్చారని మండిపడ్డ ఆయన... ఎన్నికలు దగ్గరపడితేనే మోడీకి తెలుగు ప్రజలు గుర్తుకొస్తారా? అని మండిపడ్డారు. పెన్షన్లకు ఇచ్చే రూ.1000లో రూ.800 కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని బీజేపీ ఏపీ నేతలు చేస్తున్న ప్రకటనలు అబద్దం కాదా? అని ప్రశ్నించిన కళా వెంకట్రావ్... 2014 ఎన్నిలకు ముందు బిడ్డను చంపి తల్లిని రక్షించారని మీరు ప్రకటన చేసింది వాస్తవం కాదా? కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తల్లిని, బిడ్డను ఇద్దరినీ చంపేవిధంగా లేవా? అంటూ మండిపడ్డారు. 

ఏపీకి ప్రత్యేక హోదాపై తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మాట ఇచ్చి నట్టేట ముంచింది వాస్తవం కాదా? అని లేఖలో పేర్కొన్నారు కళా వెంకట్రావ్... రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రానికి రూ.3,979 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం న్యాయమేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేజోన్‌, కడప స్టీల్‌ప్లాంట్‌, దుగ్గరాజపట్నం పోర్టు వంటి హామీలేవీ.. సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేయడం న్యాయమేనా?, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులకు కొర్రీలు వేస్తూ పోలవరం డీపీఆర్‌-2కి ఆమోదం తెలపకుండా జాప్యం చేయడం కక్ష సాధింపు కాదా?, జగన్ పై ఉన్న కేసులు ఇంత వరకు కొలిక్కి రాకపోవటం మీ లాలూచీలో భాగం కాదంటారా?, రాష్ట్రంలోని అవినీతి పరులను విదేశాలకు పంపడానికి ఏపీకి వస్తున్నారా? ఇతర రాష్ట్రాలకు ఇవ్వకుండా ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చిందేమిటి? అంటూ లేఖలో ప్రశ్నల వర్షం కురిపించారు కళా వెంకట్రావ్.