అచ్చెన్నాయుడు బెదిరిస్తున్నారు, చర్యలు తీసుకోవాలి : ఏపీ పోలీసు అధికారుల సంఘం

అచ్చెన్నాయుడు బెదిరిస్తున్నారు, చర్యలు తీసుకోవాలి : ఏపీ పోలీసు అధికారుల సంఘం

పోలీసులు రాజ్యాంగబద్దమైన, చట్టాలకు లోబడి విధులు నిర్వర్తిస్తారు తప్పు ఏక పక్షంగానో, కొన్ని రాజకీయ పార్టీలకు మద్దతుగానో పనిచేయరన్న విషయాన్ని రాజకీయ నాయకులు తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రావు అన్నారు. రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని మరణించిన గుడివాడ ఎస్.ఐ.  విజయకుమార్ కేసులో ప్రజలను అయోమయానికి గురి చేస్తూ, రాజకీయ స్వలాభం కోసం తెదేపా నాయకులు వాడుకోవడం గర్హనీయమన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో దర్యాప్తు జరుగుతుందని, ఇటువంటి సమయంలో పేకాట దాడుల నిర్వహణలో ఒత్తిడి తట్టుకో లేక ఆత్మహత్య చేసుకున్నారని అవాస్తవాలను ప్రచారం చేస్తూ కేసు దర్యాప్తును పక్క దోవ పట్టించేందుకు ప్రయత్నించడం విచారకరమన్నారు. తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నానాయుడు తాము అధికారంలోకి వచ్చిన తరువాత కానిస్టేబుల్ నుండి డీ.జీ.పి. వరకు ఎవరినీ వదలమని, రిటైర్డ్ అయినా ఇంటికి వచ్చి వారి పని చూస్తామని బెదిరించడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఇటువంటి బెదిరింపు వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఇటువంటి బెదిరింపులకు రాష్ట్రంలో పోలీసులు ఎవరూ భయపడరని ఆయన అన్నారు.