చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్.. ఆయనో దళారి..!

 చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్.. ఆయనో దళారి..!

టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమపై తీవ్రవ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కొడాలి నాని.. చంద్రబాబు ఓ దళారి అంటూ కొడాలి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు వ్యవసాయ దారుడు కాదని అన్నారు. రైతులు పండించే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి హెరిటేజ్‌లో అమ్ముకుంటాడని ధ్వజమెత్తారు. ఇక, అచ్చెన్నాయుడిపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి అధికారులు విచారణ చేస్తే.... ప్రభుత్వం హిసించిందని చంద్రబాబు మాట్లాడడం దారుణమన్నారు కొడాలి. ఓ చిన్న ఆపరేషన్ అయిన వ్యక్తి ఆస్పత్రిలో 70 రోజులు ఎవరైనా ఉంటారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి. 

దేవినేని ఉమాపై కొడాలి తీవ్ర విమర్శలు చేశారు. షోడాలు అమ్ముకొని వచ్చిన దేవినేని ఉమా... తనకు చాలెంజ్‌లు విసరడమేంటని ఫైర్ అయ్యారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ మండిపడ్డారు. ఇక, రైతులకు ఇచ్చే విద్యుత్ శాశ్వతంగా ఉండాలన్న దృక్పథంతో....10వేల మెగావాట్లతో ఏపీ గ్రీన్ ఎనర్జీ పెడుతున్నట్లు చెప్పారు మంత్రి కొడాలి నాని. గత ప్రభుత్వం మాదిరి తాము మాటలు చెప్పమన్నారాయన. చంద్రబాబు హయాంలోని బకాయిలును కూడా తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు కొడాలి నాని.