ఆగస్ట్ 15న కూడా ఇళ్ళ పట్టాల పంపిణీ లేనట్టే !

ఆగస్ట్ 15న కూడా ఇళ్ళ పట్టాల పంపిణీ లేనట్టే !

సీఎం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా వాయిదా పడుతూ వస్తున్నది. నిజానికి ఇళ్ల పట్టాల పంపిణీ ఈ ఏడాది మార్చి 15వ తేదీ అనుకున్నారు. తరువాత ఉగాది అనుకున్నారు. అదీ అవ్వలేదు, మే నెల అనుకున్నారు, కుదరలేదు. జూన్ నెల అనుకున్నారు. సాధ్యం కాలేదు. ఆగస్టు 15న అనుకుంటున్నారు అది అయ్యేట్టి కనిపించడం లేదు. ఎన్టీవీతో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇళ్లపట్టాల పంపిణీ తేదీ మారే అవకాశం ఉందన్న ఆయన ఆగస్ట్ 15న కాకుండా మరో తేదీలో పట్టాల పంపిణీ ఉంటుందని అన్నారు.

ఇక 13 జిల్లాలు అభివృద్ధి చేయాలనే దిశగా సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే అమలు జరిగే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కానీ ప్రతిపక్ష టీడీపీ స్వార్ధపూరితమైన ఆలోచనలతో అడ్డుకుంటోందన్న ఆయన టీడీపీ గతంలో అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుందని అన్నారు. తమ ప్రయోజనాలు నష్టపోతాయనే అడ్డుపడుతున్నారని జనాల ప్రయోజనాల కోసం చేసే ఏపనీ ఆగదు..మాకు భగవంతుడి సాయం కూడా ఉందని ఆయన అన్నారు. కచ్చితంగా మూడు రాజధానుల నిర్మాణం జరిగితీరుతుందన్న ఆయన త్వరలోనే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు శంకుస్థాపన చేస్తామని అన్నారు.