బాబు బంధువులు అయితే వదిలేయాలా ?

బాబు బంధువులు అయితే వదిలేయాలా ?

విశాఖ గీతం యూనివర్సిటీలో నిర్మాణాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే గీతం ఆక్రమించింది ప్రభుత్వ భూములు కాబట్టే అధికారులు స్వాధీనం చేసుకున్నారని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు బంధువులు అయినంత మాత్రాన భూములు వదిలేయాలా...? అని ప్రశ్నించారాయన. అయితే గీతం విశ్వవిద్యాలయం కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. నవంబర్‌ 30 వరకు తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో 100 మంది పోలీసులతో నిర్మాణాలు కూల్చివేశారంటూ పిటిషనర్‌ కోర్టుకు వివరించారు. ఎటువంటి నోటీసులు, ఆర్డర్లు లేకుండా ఇలా చేయటం సరికాదన్నారు. అంతేకాక.. యూనివర్సిటీ ప్రైవేట్ భూముల్లోని నిర్మాణాలు కూడా కూల్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. యూనివర్సిటీలో అదనపు భూమి కొనడానికి పెట్టుకున్న ఫైల్‌ ప్రభుత్వం దగ్గరే పెండింగ్‌లో ఉందన్నారు.  

ప్రభుత్వం మాత్రం... ఉదయం పూట కూల్చివేతలు చేపడితే... ట్రాఫిక్‌కు ఇబ్బంది అవుతుందన్న కారణంతోనే తెల్లవారుజామున అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టామని హైకోర్టుకు తెలిపింది. వాదనలన్నీ విన్న హైకోర్టు... కూల్చివేతలపై స్టే ఇస్తూ... తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది. మరోవైపు ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

చంద్రబాబు బంధువులు అయినంత మాత్రాన భూములు వదిలేయాలా?  ఈ భూముల వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఎందుకు గీతంకు భూములు ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ భూములు దోచుకునేవారికి ఆయన వత్తాసు పలుకుతారా? అని ప్రశ్నించారు.  మొత్తానికి గీతం వర్శిటీ ఆక్రమణల అంశం.. ఏపీ రాజకీయాల్లో హీట్‌ పెంచుతోంది.