ఏపీలో స్థానిక ఎన్నికలు ఉంటాయా?

ఏపీలో స్థానిక ఎన్నికలు ఉంటాయా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడప్పుడే జరగవా? ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సర్కార్‌కు ఇష్టం లేదా? ఇప్పటి వరకూ అయిన గందరగోళం.. కేసులు.. కోర్టు వ్యవహారాలతో ప్రభుత్వం వ్యూహం మార్చుకుందా? ఆయనతో పెట్టుకునే కంటే.. ఆయన పోయాక.. చూసుకుంటే సరిపోతుందని డిసైడ్‌ అయ్యారా? 

ఏపీలో స్థానిక ఎన్నికలు ఉంటాయా?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తొలగింపు వ్యవహారం అమరావతి నుంచి ఢిల్లీ దాకా ఎంత చర్చనీయాంశమైందో అందరికీ తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రమేష్‌తోపాటు కొంత మంది హైకోర్టు, సుప్రీంకోర్టుకెళ్లడం.. కోర్టులు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. సర్కార్‌ కూడా దీనిమీద చివరకంటూ పోరాటం చేసింది. అటు గవర్నర్ కూడా రమేష్‌ వైపే మొగ్గు చూపడంతో చివరాఖరికి ప్రభుత్వం వెనక్కి తగ్గిందో.. వ్యూహం మార్చిందో కానీ రమేష్‌ కుమార్‌ను SECగా మళ్లీ నియమించింది.  రమేష్‌ బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పుడు ఎన్నికలు ఉంటాయా? ఉంటే ఎప్పుడుంటాయి అన్న చర్చ జరుగుతోంది. 

ఎస్‌ఈసీగా ఉన్నా రమేష్‌కు నిర్వహించడానికి ఎన్నికలు ఉండవా?

అయితే ప్రభుత్వం ఇంకో ఆలోచన చేస్తోందట. రమేష్‌ నియామకం వరకే సరిపెట్టేసి.. ఆయనకు పనేమీ లేకుండా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంటే.. రమేష్‌ SECగా ఉంటారు. కానీ.. ఆయన నిర్వహించడానికి ఎన్నికలు ఉండవు.  ప్రభుత్వం ఎలాగూ కరోనా కారణంగా  ఇప్పటికే ఎన్నికలు వాయిదా పడటం .. రాష్ట్రంలో కేసులు  లక్షా 70 వేల వరకూ వెళ్లడంతో ఇప్పట్లో తొందరపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అనుకుంటోందట.  వచ్చే మార్చిలో రమేష్‌ పదవీ విరమణ చేస్తారు. అప్పటికి  కోవిడ్‌ కూడా  నెమ్మదించే వీలుంది. 

ఏం చెప్పాలన్నదానిపై అధికారుల స్థాయిలో కసరత్తు!

ఒకవేళ ఎన్నికల నిర్వహణకు రమేష్‌ కుమార్‌ మొగ్గు చూపినా.. కరోన కేసుల ఉధృతిని చెప్పి ఎన్నికల వాయిదాకు ప్రభుత్వం సూచించే అవకాశం ఉంది. ఈ అంశంపై  ప్రభుత్వం నుంచి ఎలాంటి స్టెప్స్‌ తీసుకోవాలనే దానిపై  పంచాయతీరాజ్‌ అధికారులతోపాటు.. ఇతర ముఖ్య అధికారుల స్థాయిలో కసరత్తు  జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను రమేష్‌ కుమార్‌ వాయిదా వేసినప్పటి నుంచి ప్రభుత్వానికి ఆయనకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. 

గతంలో ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్‌ చెల్లుబాటు అవుతుందా? 

 గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ బేస్‌ చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఇప్పుడు ఆ ఆర్డినెన్స్‌ మురిగిపోయి.. అవే అంశాలతో కూడిన కొత్త ఆర్డినెన్స్‌ జారీ అయిన క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ చెల్లుబాటు అవుతుందా..? లేదా..? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ మొత్తం పరిణామాలను బేరీజు వేసుకుని చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కన్పించడం లేదనే చెప్పాలి.