తెలకపల్లి రవి : లీగల్‌ సవాళ్లలో ఏపీ సర్కార్...!  

తెలకపల్లి రవి : లీగల్‌ సవాళ్లలో ఏపీ సర్కార్...!  

తెలకపల్లి రవి

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలు తరచూ  కొట్టివేయబడుతున్నాయి.  వివిధ పార్టీలు ,సంఘాలు,వ్యక్తులు  వేసిన పిటిషన్లకు అనుకూమైన ఉత్తర్వులు వస్తున్నాయి. వాటిపై స్టే కోసం సుప్రీం కోర్టుకు వెళితే నిరాకరించబడటం చాలాసార్లు జరిగింది. బుధవారం నాడు కూడా వరుసగా మూడు నాలుగు కేసుల్లో  వ్యతిరేక తీర్పు రాగా మరికొన్ని విచారణలో వున్నాయి. ఇంగ్లీషు మీడియంకు సంబంధించి జారీ అయిన 81,85 జీవోలను  హైకోర్టు కొట్టివేయడంపై ఈ రోజు సుప్రీం కోర్టు స్టే నిరాకరించి నోటీసు జారీ చేసింది. జగన్‌ సర్కార్‌కు  కోర్టు షాక్‌ అనేది స్టాక్‌ హెడిరగ్‌గా మారింది. దాంతో కొందరు వైసీపీ నాయకులు , కార్యకర్తలు కోర్టుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల పై  మరో కేసు నడుస్తున్నది. రాజ్యాంగంలో కోర్టుకూ ప్రభుత్వానికీ వాటి వాటి పరిధి వుంది గనక ఒక వ్యవస్థకు మరొకటి వ్యతిరేకం అన్నట్టు వ్యవహరించే అవకాశం  వుండదు. న్యాయమూర్తుల విచక్షణతో పాటు  ప్రభుత్వ విధానాలలో  కొన్ని చట్టపరమైన లొసుగులు లేదా నిబంధనలు ఇందుకు కారణమవుతుంటాయి. కనుకనే బిల్లు ఆమోదించేటప్పుడే విమర్శను కూడా దృష్టిలో పెట్టుకుని పగడ్బందీగా  పటిష్టంగా వుండేలా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత.  వాటిపై  వచ్చే  లీగల్‌ సవాళ్లకు దీటుగా వ్యూహం రూపొందించుకోవడం న్యాయ విభాగం పని. హైకోర్టులో ఇన్నిసార్లు ఎదురుదెబ్బు తగలడం, సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థిస్తూ స్టే  నిరాకరించడం చూస్తే జరిగే కసరత్తు చాలడం లేదని  అర్థమవుతుంది.

కార్యాలయాలకు రంగులు, ఎన్నికల  కమిషనర్‌ నియామకం లాంటి  అంశాల్లో  సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి ఉపశమనం వస్తుందని ఎవరూ ఆశించలేదు. ఇంగ్లీషు మీడియం జీవో విషయంలోనూ తెలుగు మీడియంను పూర్తిగా తీసివేయడం లోను  రాజ్యాంగ నిబంధనను అనుమతించవు గనక సుప్రీం ఏమి చెబుతుందో చూడవసి వుంటుంది. అయితే ఇంకా అనేక కేసుల్లో కూడా అదే పరిస్థితి రావడం యాదృచ్చికమేనా. బుధవారం నాడు వరుసగా మూడు నాలుగు విషయాల్లో ఇదే జరిగింది. టిడిపి నాయకులకు సంబంధించిన మైనింగ్‌ లీజు రద్దును హైకోర్టు కొట్టి వేసింది. కరోనా రోగుల  దగ్గర  ఎక్కువ రేట్లు వసూలు  చేసినందుకు గాను  రమేష్‌ ఆస్పత్రి గుర్తింపు రద్దు కోసం ఇచ్చిన తార్ఫీదును రద్దు చేసింది. అనుమతించిన పరిధిలో  పొరుగు రాష్ట్రాల  నుంచి మద్యం బాటిళ్లను తీసుకురావడం తప్పుకాదని చెప్పింది.  ఈ మూడు కేసుల్లోనూ  ఇచ్చిన ఉత్తర్వులలో చట్టపరంగా లొసుగులు  లేకపోతే కోర్టు ఏకపక్షంగా కొట్టి వేసే అవకాశం వచ్చేది కాదు. ఉదాహరణకు మద్యం పాలసీపై 411 జీవోలో మూడు విదేశీ మద్యం, మూడు ఐఎంఎఫ్‌ఎల్‌, బీరు సీసాలు ఎన్ని  కలిగివుండవచ్చునో చెబుతున్నది. బయిటనుంచి వచ్చేవారికీ అది వర్తిస్తుంది. డా.రమేష్‌ ఆస్పత్రి ప్రమాదం విషయంలో కరోనా కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది గనక సంబంధిత జిల్లా అదికారులను నిందితులుగా చేర్చే వరకూ ఆయనపైన చర్యలు  తీసుకోరాదని కోర్టు ఇచ్చిన  ఆదేశాలు  ఆశ్చర్యం కలిగించాయి. దానిపైనా సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం వుంది. అయితే రేట్ల విషయం ఈ ప్రమాదం తర్వాతనే ప్రభుత్వం తీసుకోవడం గమనించదగ్గది. కోర్టు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవచ్చు. వేర్వేరు కేసు వేర్వేరు బెంచీలు విచారిస్తుంటాయి.  కనుక తీర్పు లేదా మధ్యంతర ఉత్తర్వులు   అనుకూలంగా  వున్నా లేక వ్యతిరేకంగా వున్నా వాటి పరిధిలో చూడవసిందే గాని అన్నీ ఒకే కంట కట్టడం పొరబాటవుతుంది. ఇప్పుడు కూడా జడ్జి ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణ కేసు, జస్టిస్‌ ఈశ్వరయ్య సంభాషణ కేసు,  కోర్టుకు వ్యతిరేకంగా వ్యాఖ్యల కేసు కోర్టు ముందున్నాయి. సిబిఐ విచారణకు ఆదేశిస్తానని కూడా కోర్టు చెప్పింది . అత్యంత కీలమైన  రాజధాని తరలింపు కేసులో 75కు పైగా పిటిషన్లు దాఖలవగా  కొత్తగా అక్కడ  అతిధి గృహ నిర్మాణంపైనా పిల్‌ దాఖలైంది. ఈ విషయంలో హైకోర్టు విధించిన స్టేటస్‌కో ఉత్తర్వుల  ఎత్తివేతకు సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. తాజాగా ఎన్నికల  కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తమ కార్యాలయ కంప్యూటర్‌ పెన్‌డ్రైవ్‌ ను సిఐడి వారు తీసుకెళ్లారంటూ ఫిర్యాదు చేసిన కేసు రాబోతున్నది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల పై దర్యాప్తు కోసం సిట్‌ను  నియమించిన మంత్రివర్గం అందుకోసం ప్రత్యేక కోర్టు  ఏర్పాటును కోరడంపై టిడిపి నాయకులు  కేసు వేశారు.ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మరింత సమయం కోరడంతో ఏడవ తేదీకి వాయిదా పడింది.  

పివి నరసింహారావు తన చివరి కాలంలో  చూసిన క్రియాశీల  న్యాయవ్యవస్థ నమూనా ఇప్పుడే ఏపిలో కనిపిస్తుంది. రాజ్యాంగ పరంగా ప్రభుత్వాలకు వాటి  అధికార పరిధి వున్నట్టే  చేసిన నిర్ణయాల  సమీక్షలో కోర్టుకూ స్వయం ప్రతిపత్తి వుంది. కోర్టుకు ఎంతమంది వెళతారు .. అవి  ఏం చెబుతాయి అన్నది ఎలా వున్నా ఇదొక అనివార్య పరిస్థితి.  నిబంధలను ప్రజాస్వామ్య సూత్రాలను  వృత్తిపరమైన సమర్థత ఖచ్చితంగా పాటించడం ద్వారానే జగన్‌ ప్రభుత్వం ఈ  సవాళ్లను అధిగమించగలుగుతుంది తప్ప రాజకీయ కోపతాపాల  వల్ల  ప్రయోజనం లేదు. టిడిపి లేదా వారిని బలపర్చే మీడియా కూడా కోర్టు రాజకీయ వేదికలైనట్టు చిత్రించడం పొరబాటవుతుంది. ఈ  ప్రభుత్వ  తప్పిదాల పై ఇన్ని కేసులు  వేసేవారు తమ హయాంలో నిర్ణయాల పై వచ్చిన కేసును ఎందుకు వ్యతిరేకించారంటే సమాధానం లభించదు. కనుకనే  ఈ విషయంలో ఇరువైపులా సమతుల్యత  తప్పనిసరి. కోర్టు తీర్పును ఆదేశాలను  అప్పుడు లీగల్‌ ప్రతిష్టంభనను  విధానాల  సహేతుకతను సమీక్షకు ప్రజాస్వామిక చర్చకు ఉపయోగించుకోవడం శ్రేయస్కారం.