టీడీపీ ఎమ్మెల్యేల‌పై డిప్యూటీ సీఎం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ముగ్గురు న‌లుగురు..!

టీడీపీ ఎమ్మెల్యేల‌పై డిప్యూటీ సీఎం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ముగ్గురు న‌లుగురు..!

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల‌పై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాసు.. శ్రీ‌కాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. మా నాయకుడు సీఎం వైఎస్ జ‌గ‌న్ త‌ల‌చుకుంటే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఊడిపోతుంద‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు, నలుగురు అటూ ఇటూ ఊగుతున్నార‌ని వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం.. టీడీపీని 16,15 స్థానాలకు పరిమితం చేయాలని మేం అనుకుంటే ప్రతిపక్ష హోదా కూడా ద‌క్క‌ద‌ని.. కానీ, మేం అలా అనుకోవడం లేద‌న్నారు. పాలకపక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ఉండాలనే మేం అనుకుంటున్నామ‌న్న ధ‌ర్మాన‌.. అనవసర విమర్శలు మానుకుని.. ప్రతిపక్ష టీడీపీ నేతలు విజ్ఞతతో ఆలోచించాల‌ని హిత‌వు ప‌లికారు. 

ఇక‌, తెలుగుదేశం పార్టీని తాము విమ‌ర్శించాల‌నుకోవ‌డంలేద‌న్నారు డిప్యూటీ సీఎం ధ‌ర్మాన‌... నా దృష్టిలో విమర్శించడమే ఒక అవలక్షణంగా పేర్కొన్న ఆయ‌న‌.. ప్రతిపక్షానికి కూడా బాధ్యతాయుతమైన పాత్ర ఉంద‌ని గుర్తు చేశారు.. పాలకపక్షం , ప్రతిపక్షం కలిసి వ్యవస్థను నడిపితేనే సక్రమమైన పాలన అందుతుంద‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. మాలో ఉన్న లోపాలను ఎత్తిచూపండి... సద్విమర్శలు చేయండిలో తప్పులేదు.. కానీ, ఏదిప‌డితే అది మాట్లాడ‌డం మాత్రం త‌గ‌ద‌ని హెచ్చ‌రించారు. అయితే, అటూఇటుగా ఉన్న ఆ న‌లుగురు ఎమ్మెల్యేలు ఎవ‌రు? అనే చ‌ర్చ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేలు.. టీడీపీకి గుడ్‌బై చెబుతున్నార‌నే ప్ర‌చారం ఉన్న నేప‌థ్యంలో.. డిప్యూటీ సీఎం వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.