కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ కు లేఖ రాసిన సీఎం జగన్‌

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ కు లేఖ రాసిన సీఎం జగన్‌

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి నేను వచ్చేందుకు సిద్ధమయ్యానని, ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఎజెండా పాయింట్స్ తో ఆగస్టు 4వ తేదీన లేఖ కూడా పంపామని పేర్కొన్నారు. మా రాష్ట్రం నుంచి ఎటువంటి స్పందన లేదని మీరు పేర్కొనటం చూస్తే లేఖ అధికారులు ఈ అంశం మీ దృష్టికి తీసుకురాలేదని తెలుస్తోందని అన్నారు. మీరు లేఖలో పేర్కొన్నట్టుగా కృష్ణానదిపై ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్ట్స్ కొత్తవి కావని, ఇవన్నీ 2015 జూన్ లో తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినవేనని పేర్కొన్నారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం కేవలం అనుబంధ ప్రాజెక్ట్ మాత్రమేనన్న ఆయన ప్రస్తుతం ఉన్న కాల్వల ద్వారానే, అదనపు ఆయకట్టు ఈ పథకం కింద ఉండదని అన్నారు. తమకు కేటాయించిన నీటిలోనే మేము రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నీటిని వినియోగించుకుంటామని జగన్ లేఖలో పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్ట్స్ కు మాత్రమే నదీ యాజమాన్య బోర్డ్ ల వద్ద అనుమతి తీసుకోవాలని విభజన చట్టంలో ఉందన్న ఆయన తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్ట్ లో మేము పిటిషన్ కూడా దాఖలు చేశామని అని పేర్కొన్నారు.

ఈ విషయమై సుప్రీంకోర్ట్ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్రాన్ని 2016లోనే సూచించిందని లేఖలో పేర్కొన్నారు. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ల నిర్మాణాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసిందని, తెలంగాణ నిర్మిస్తున్న ఈ పథకాలపై ఎపెక్స్ కౌన్సిల్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల మేము మరలా ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నామని అన్నారు.