59 లక్షల ఓట్ల తొలగింపు సూత్రధారి జగనే: బాబు

59 లక్షల ఓట్ల తొలగింపు సూత్రధారి జగనే: బాబు

రాష్ట్రంలో 59 లక్షల ఓట్ల తొలగింపు సూత్రధారి వైసీపీ అధినేత జగనేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం సీఎం పలువురు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఫారమ్ 7 దుర్వినియోగం చేశానని జగనే చెప్పారు. తొలిదశలో 13లక్షల ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నారన్నారు. 2వేల మంది వైసీపీ వాళ్లే 8లక్షల దరఖాస్తులు పెట్టారు. 59 లక్షల ఓట్ల తొలగింపు సూత్రధారి జగనే. సకాలంలో వేగంగా స్పందించి కుట్రలను అడ్డుకున్నామని సీఎం అన్నారు. దేశంలో అన్నిపార్టీలకు యాప్‌లు ఉన్నాయి. టీఆర్ఎస్ మిషన్ యాప్, బీజేపీ యాప్, వైసీపీ యాప్ లు ఉన్నాయి. అయినా టీడీపీ యాప్ పైనే దుష్ప్రచారానికి తెగబడ్డారని సీఎం మండిపడ్డారు.

హైదరాబాద్ లో మనపై కేసులు పెట్టిస్తున్నారు. మన డేటా దొంగిలించి ఓట్లు వేయాలని మనకే ఫోన్లు చేస్తున్నారు. వైసీపీ నుంచి ఫోన్లు చేసేవారిని నిలదీయాలి. మా నెంబర్ ఎవరిచ్చారని వైసీపీ వారిని ప్రశ్నించాలని సీఎం సూచించారు. అంతేకాదు టీడీపీ డేటా ఎందుకు చోరీ చేశారు. దొంగలకు ఓట్లు ఎందుకు వేస్తామని ధైర్యంగా చెప్పాలన్నారు. టీడీపీలో 65 లక్షల కార్యకర్తలు, 5 లక్షల మంది సేవామిత్రలు ఉన్నారు. వీళ్లందరి సమాచారాన్ని దొంగిలించడం దుర్మార్గం. దొంగిలించిన సమాచారాన్ని మన ప్రత్యర్ధులకు ఇచ్చారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.