చమన్ చివరి కోరిక తీరుస్తా

చమన్ చివరి కోరిక తీరుస్తా

గుండెపోటుతో మరణించిన టీడీపీ నేత, అనంతపురం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ చమన్‌ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓదార్చారు. ఇవాళ ఉదయం ఆయన భార్య రమీజాబీకి ఫోన్ చేసిన సీఎం.. చమన్ మృతిపై సంతాపం తెలియజేశారు.. కుటుంబానికి అండగా ఉంటానని.. కుమారుడు ఉమర్‌ ముక్తాను డాక్టర్‌గా చూడాలనేది చమన్ కోరిక అని.. ఆ బాధ్యతను తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాగా నిన్న ఒక్కసారిగా గుండెపోటుకు గురైన చమన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన దివంగత పరిటాల రవికి కుడిభుజంలా వ్యవహరించారు. చమన్ మరణవార్త తెలియగానే ఆసుపత్రికి చేరుకున్న మంత్రి పరిటాల సునీత ఆయన భౌతికకాయాన్ని చూడగానే కుప్పకూలిపోయారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం స్వగ్రామంలో చమన్ అంత్యక్రియలు జరగనున్నాయి.