తిరుపతి బై పోల్స్‌.. హైదరాబాద్‌లో ఏపీ బీజేపీ కీలక భేటీ..

తిరుపతి బై పోల్స్‌.. హైదరాబాద్‌లో ఏపీ బీజేపీ కీలక భేటీ..

తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ... ఇప్పటికే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో చర్చలు జరిపారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు... ఇక, ఇవాళ.. దీనిపై హైదరాబాద్‌లో కీలక భేటీ జరుగుతోంది.. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధరన్‌తో సోము వీర్రాజుతో పాటు ఏపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. జనసేనానితో ఆదివారం రోజు జరిగిన చర్చలతో పాటు.. తమ అభిప్రాయాలను మురళీధరన్‌కు తెలియజేస్తున్నట్టుగా తెలుస్తోంది.. తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీ దూకుడుగా ఉండగా.. ఇక, తమ అభ్యర్థిని తేల్చేపనిలో పడిపోయింది బీజేపీ.. అయితే, ఉమ్మడిగా బరిలోకి దిగి.. 2024 ఎన్నికల్లో గెలిచి ఏపీలో బీజేపీ-జనసేన సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని భావిస్తున్నాయని చెబుతున్నారు. ఏదైనా అంశంలో అభిప్రాయభేదాలు ఉంటే ఎప్పటికప్పుడు చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. ఎంపీ అభ్యర్థిగా బీజేపీ, జనసేనల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఉమ్మడి అభ్యర్థిగానే భావించి విజయానికి కృషి చేయాలని పవన్‌-సోమువీర్రాజు అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటికి సిద్ధమైన జనసేన.. బీజేపీ నేతలతో చర్చలతో చివరి నిమిషాంలో పోటీ నుంచి తప్పుకుంది.. ఇప్పుడు తిరుపతిలో తామే పోటీచేస్తామని పట్టుబట్టినట్టుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ కంటే తమకే మెరుగైన ఓటు బ్యాంకు కూడా ఉందని జనసేన నేతలు చెబుతున్నారు.