ఐదు పదుల 'దసరా బుల్లోడు'

ఐదు పదుల 'దసరా బుల్లోడు'

నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ లో మొట్టమొదటి స్వర్ణోత్సవ చిత్రం 'దసరాబుల్లోడు'. జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం 'దసరాబుల్లోడు'. జనవరి 13తో 'దసరాబుల్లోడు' యాభై ఏళ్ళు  పూర్తి చేసుకుంటోంది. 1971 జనవరి 13న విడుదలైన 'దసరాబుల్లోడు' అపూర్వ విజయం సాధించింది. అంతకు ముందే అనేక చిత్రాల్లో జంటగా నటించిన ఏయన్నార్, వాణిశ్రీ జోడీకి ఓ స్పెషల్ క్రేజ్ ను తీసుకు వచ్చింది ఈ చిత్రం. 

ఏయన్నార్ తొలి గోల్డెన్ జూబ్లీ!
ఒకప్పుడు వరుస విజయాలతో సందడి చేశారు ఏయన్నార్. 1964లో ఆయన నటించిన 'మూగమనసులు' బ్లాక్ బస్టర్ గా నిలచింది. ఆ సినిమా తరువాత 'పూలరంగడు' (1967) దాకా ఏయన్నార్ కు బంపర్ హిట్ లేదు. ఆ పైన 'ధర్మదాత' (1970) కూడా ఘనవిజయం సాధించింది.  ఈ చిత్రాల నడుమ వచ్చిన ఏయన్నార్ సినిమాలు ఈ చిత్రాల స్థాయిలో అలరించలేకపోయాయి. ఆ సమయంలో ఏయన్నార్ హీరోగా జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై 'దసరాబుల్లోడు' రంగుల చిత్రంగా రూపొందింది. ఏయన్నార్ అంటే ప్రాణం పెట్టే నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్. అందువల్ల అక్కినేని అభిమానులు సైతం 'దసరాబుల్లోడు' ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూశారు. సంక్రాంతి సంబరాల్లో 'దసరాబుల్లోడు' సందడి చేయడానికి వస్తున్నాడని తెలియగానే అభిమానుల ఆనందం అంబరమంటింది. వారి అంచనాలకు తగ్గట్టుగానే 'దసరాబుల్లోడు' ఆ నాటి సంక్రాంతి సంబరాల్లో అందరికన్నా పైచేయిగా నిలచింది. అంతకు ముందు ఏయన్నార్ నటించిన అనేక చిత్రాలు ఘనవిజయాలను సొంతం చేసుకున్నా ఏదీ గోల్డెన్ జూబ్లీ జరుపుకోలేదు. ఈ సినిమా సంవత్సరం పాటు ప్రదర్శితమై ఏయన్నార్ కెరీర్ లో తొలి గోల్డెన్ జూబ్లీ హిట్ గా నిలచింది. ఈ విషయాన్ని 'అన్నపూర్ణ సినీ స్టూడియోస్' ప్రారంభోత్సవ సందర్బంగా ప్రకటించిన ప్రత్యేక సంచికలో  పేర్కొన్నారు. 

తొలి ప్రయత్నంలోనే బంపర్ హిట్!
'అన్నపూర్ణ' చిత్రంతో నిర్మాతగా జనం ముందు నిలచిన వి.బి.రాజేంద్రప్రసాద్, ఏయన్నార్ తో తొలుత 'ఆరాధన' (1962) చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువాత ఏయన్నార్ తోనే "ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు, అక్కాచెల్లెలు" వంటి చిత్రాలను తెరకెక్కించారు.  ఈ చిత్రాల్లో 'అక్కాచెల్లెలు'కు ఏ.సంజీవి దర్శకత్వం వహించగా, మిగిలిన అన్ని చిత్రాలకు వి.మధుసూదనరావు దర్శకత్వం వహించారు. తొలుత ఆయన దర్శకత్వంలోనే 'దసరాబుల్లోడు' నిర్మించాలని భావించారు రాజేంద్రప్రసాద్. అయితే మధుసూదనరావు ఇతర చిత్రాలతో బిజీగా ఉన్న కారణంగా, డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయారు. దాంతో ఏయన్నార్ ప్రోత్సాహంతో వి.బి.రాజేంద్రప్రసాద్ మెగాఫోన్ కూడా పట్టవలసి వచ్చింది. అప్పటికే నిర్మాతగా మంచి అనుభవమున్న రాజేంద్రప్రసాద్, దర్శకునిగా తొలి చిత్రం 'దసరాబుల్లోడు'తోనే తనదైన బాణీ పలికించారు. తొలి ప్రయత్నంలోనే డైరెక్టర్ గా 'దసరాబుల్లోడు'తో బంపర్ హిట్ కొట్టారు రాజేంద్రప్రసాద్. 

పల్లె వాతావరణంలో 'దసరాబుల్లోడు'
'దసరాబుల్లోడు'లో ఆంధ్రప్రాంతంలోని గ్రామీణ వాతావరణంలో సాగే సంబరాలు, వరసైన వాళ్ళను ఆటపట్టించే బావలు, మరదళ్ళు, మావయ్యలను వేళాకోలం చేసే అల్లుళ్ళు  కనిపిస్తారు. అన్నదమ్ముల అనుబంధాలు, దత్తత తీసుకున్న వారి మమకారాలు, ఆధిపత్యాలు, ఉన్నవాడి అహంకారం, లేనివారి అభిమానం అన్నీ ఈ చిత్రంలో కనిపించి అలరించాయి. ఇక పచ్చని చేలలో సాగిన పాటల చిత్రీకరణ సైతం జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. అప్పుడప్పుడే తెలుగునాట రంగుల చిత్రాల ఊపు మొదలయింది. ఆ సమయంలో వచ్చిన 'దసరాబుల్లోడు' అనూహ్య విజయాన్ని మూటకట్టుకుంది. 

'దసరాబుల్లోడు' అట్రాక్షన్స్ 
'దసరాబుల్లోడు' చిత్రంలో ఏయన్నార్, వాణిశ్రీ, చంద్రకళ, ఎస్వీరంగారావు, గుమ్మడి, నాగభూషణం, అంజలీదేవి, సూర్యకాంతం, పద్మనాభం, రావి కొండలరావు, రాధాకుమారి తదితరులునటించారు. ఈ చిత్రానికి మాటలు-పాటలు ఆచార్య ఆత్రేయ రాయగా, కేవీ మహదేవన్ స్వరకల్పన చేశారు. ఇందులోని పాటలన్నీ జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరో ఏయన్నార్ సంచరించే బుల్లి కారు ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలచింది. తెలుగునాట ఈ సినిమా చూసిన కొందరు జమీందార్లు అలాంటి బుడ్డ కార్లను తయారు చేయించుకొని, వాటిలో తిరుగుతూ పరవశించిపోయారు. ఇక ఏయన్నార్, వాణిశ్రీ మధ్య సాగిన రొమాన్స్  అప్పటి కుర్రకారును విశేషంగా ఆకట్టుకుంది. 

థియేటర్లలో 'దసరాబుల్లోడు' సందడి!
'దసరాబుల్లోడు' చిత్రం 30కి పైగా కేంద్రాలలో విడుదలయింది. 29 కేంద్రాలలో అర్ధశతదినోత్సవం జరుపుకుంది. 21 కేంద్రాలలో డైరెక్టుగానూ, కర్నూల్ లో షిఫ్ట్ మీద శతదినోత్సవం చూసింది. ఏయన్నార్ 'సుపుత్రుడు' చిత్రం రావడంతో విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, గుంటూరు కేంద్రాలు తప్ప అన్ని సెంటర్స్ లో సినిమాను తీసేశారు. ఆ తరువాత ఈ నాలుగు సెంటర్లలో గుంటూరు షిస్ట్ కాగా, మిగిలిన కేంద్రాలలో రజతోత్సవం, ద్విశతదినోత్సవం చూసింది ఈ చిత్రం. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ కేంద్రాలలో 200 రోజుకు ఎత్తేసి 'శ్రీవేంకటేశ్వర వైభవం' వేశారు. ఇక తిరుపతిలో 200 రోజుల తరువాత 'భలే పాప'కు ఎత్తేశారు. 12 రోజుల తరువాత అంటే 'దసరాబుల్లోడు' 213వ రోజు నుండి మళ్ళీ  తిరుపతి ప్రతాప్ థియేటర్ లో ఈ సినిమానే వేసి, 254 రోజుల దాకా ఆడారు. ఆపై అదే థియేటర్ లో ఏయన్నార్ 'ప్రేమనగర్' విడుదలయింది. ఇక హైదరాబాద్ లో షిఫ్టుల మీద స్వర్ణోత్సవం పూర్తి చేసుకుంది. అంతకు ముందు తెలుగులో ఏ సాంఘిక చిత్రం ఇంతలా అలరించింది లేదు. ఏయన్నార్ అభిమానులకు ఈ నాటికీ 'దసరాబుల్లోడు' పేరు వింటే ఉత్సాహం ఉరకలు వేస్తుందని చెప్పవచ్చు.