టీడీపీకి మరో ఎదురుదెబ్బ ‌... సీనియర్ నేత రాజీనామా

టీడీపీకి మరో ఎదురుదెబ్బ ‌... సీనియర్ నేత రాజీనామా

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఏపీలో అధికారం పోగోట్టుకోవడమే కాక...అతి తక్కువ సీట్లకు పరిమితమైంది టీడీపీ పార్టీ. వైసీపీ అధికారం చేపట్టాక..టీడీపీ నుంచి వైసీపీకి వలసలు మరింత జోరందుకున్నాయి. ఇప్పటికే చాలా మంది సీనియర్‌ నాయకులు టీడీపీని వీడి..వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇంకా కొందరు వైసీపీలోకి క్యూ కడతారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో  తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు టీడీపీకి గుడ్‌ బై చెప్పారు. పార్టీ వీడడంపై ఆయన స్పందిస్తూ...పార్టీలో పరిస్థితులు బాగాలేవని, సుదీర్ఘకాలం పని చేసినా గుర్తింపు దక్కలేదని అందుకే పార్టీ వీడుతున్నట్టు తెలిపారు. ఆత్మ గౌరవంతో పుట్టిన పార్టీ ప్రస్తుతం కనుమరుగైందని..అందకే రాజీనామా చేస్తున్నట్లు బాబూరావు పేర్కొన్నారు. కాగా..విజయనగరం జిల్లాకు చెందిన గద్దె బాబూరావు ఓ సారి ఎమ్మెల్సీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.  అయితే ఆయన ఏ పార్టీలో చేరతారో అనే విషయంపై క్లారిటీ రాలేదు.