బెజవాడలో మరోసారి గ్యాంగ్ వార్... క‌ర్ర‌లు, క‌త్తుల‌తో దాడి..!

బెజవాడలో మరోసారి గ్యాంగ్ వార్... క‌ర్ర‌లు, క‌త్తుల‌తో దాడి..!

బెజ‌వాడ గ్యాంగ్ వార్‌ల‌కు అడ్డాగా మారిపోతోంది.. కొద్దిరోజుల కింద బెజ‌వాడ‌లో సందీప్-కేటీఎం పండు మధ్య జరిగిన గ్యాంగ్ వార్ సంచ‌ల‌నం సృష్టించ‌గా.. తాజాగా మరో గ్యాంగ్ వార్ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది.. మున్నా- రాహుల్ గ్యాంగ్‌ల‌కు చెందిన ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. కత్తులు, కర్రలు, మార‌ణాయుధాల‌తో దాడికి దిగారు.. జులై 31వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా.. ఆల‌స్యంగా గ్యాంగ్ వార్ వెలుగు చూసింది. ఇక‌, ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్టుగా చెబుతున్నారు. 

నాగుల్ మీరా అలియాస్ మున్నా - రాహుల్.. కేదారేశ్వరపేటలో రెండు గ్యాంగ్‌లు మెయింటైన్ చేస్తున్నారు. అయితే, వీరిద్దరి మధ్య గతంలో పాత గొడవలు కూడా జ‌రిగిన‌ట్టు తెలుస్తుండ‌గా... క‌క్ష‌లు పెంచుకున్న రెండు వ‌ర్గాలు.. మ‌రోసారి గ‌త నెల 31వ తేదీన‌ దాడుల‌కు దిగారు.. కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు. మొద‌ట రాహుల్ వ‌ర్గం దాడి చేసిన‌ట్టు తెలుస్తుండ‌గా.. ఆ త‌ర్వాత ఆగ్రహంతో ఊగిపోయిన మున్నా గ్యాంగ్ కూడా అదే రోజు రాత్రి ఎదురు దాడికి దిగింది. అయితే, పరస్పర దాడుల తర్వాత రెండు గ్యాంగ్‌లు సైలెంట్‌గా ఉండ‌డంతో బ‌య‌ట‌కు పొక్క‌లేదు. కానీ, వినయ్ అనే యువకుడు.. మున్నా వ‌ర్గం తనపై దాడి చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో ఘ‌ట‌న వెలుగు చూసింది.. రంగంలోకి దిగిన పోలీసులు గ్యాంగ్ వార్ కేసుల‌ 11 మందిని అరెస్ట్ చేశారు. కాగా, విజ‌య‌వాడ‌లో వ‌రుస ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి... ఒక‌ప్పుడు రౌడీయిజం, గ్యాంగ్‌ల‌కు పెట్టింది పేరైన బెజ‌వాడ‌లో మ‌ళ్లీ ఇలాంటి ఘ‌ర్ష‌ణ‌లు ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి.