కోవిడ్‌ వ్యాక్సిన్‌కు ఏపీ రెడీ.. జిల్లాల వారీగా జాబితా సిద్ధం

కోవిడ్‌ వ్యాక్సిన్‌కు ఏపీ రెడీ.. జిల్లాల వారీగా జాబితా సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్ కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. పూణె నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైల్స్‌ను .. గన్నవరం టీకాల సెంటర్‌కు వ్యాక్సిన్ బాక్సులు తరలించారు. వ్యాక్సిన్ ను నిల్వ చెయ్యడానికి అవసరం అయిన స్టేరేజ్ ఏర్పాట్లు చేసి అక్కడ బాక్స్ లను ఉంచారు. ఇక, ఇప్పటికే రాష్ట్రానికి చేరిన వ్యాక్సిన్ ను అన్ని జిల్లాలకు పంపిణీ చేసే పని మొదలు పెట్టారు. వైద్యులు, పారామెడికల్ స్టాఫ్, పోలీసు సిబ్బంది తొలి విడతగా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ముందుగా ఆరోగ్య సిబ్బందికి కోవిడ్‌ టీకాలు వేయనున్నారు అధికారులు.. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునే 3,87,983 మందిని గుర్తించారు. ఈ మేరకు జిల్లాల వారీగా జాబితాను సిద్ధం చేసిపెట్టింది వైద్యారోగ్య శాఖ.

అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో వ్యాక్సిన్‌ లబ్దిదారులను గుర్తించారు. కోవిడ్‌ వ్యాక్సిన్ లబ్ధిదారులకు కోవిన్‌ యాప్‌ ద్వారా ఎస్సెమ్మెస్సులు పంపనుంది ప్రభుత్వం.. ఇక, జిల్లాల వారీగా కోవిడ్‌ వ్యాక్సిన్ లబ్దిదారుల వివరాలు పరిశీలిస్తే.. అనంతపురంలో 29,065, చిత్తూరులో 33,773, తూర్పు గోదావరిలో 38,128, గుంటూరులో 35,389, కృష్ణా జిల్లాలో 34,813, కర్నూలులో 33,279, ప్రకాశం జిల్లాలో 25,383, నెల్లూరులో 31,346, శ్రీకాకుళంలో 21,934, విశాఖపట్నంలో 36,694, విజయనగరంలో 17,465, పశ్చిమగోదావరిలో 27,323, కడప జిల్లాలో 23,391 మంది లబ్ధిదారులను గుర్తించారు అధికారులు.