డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు సంచలనం...రేపు సాయంత్రంలోగా !
ఏపీలో కలకలం రేపిన విశాఖ డాక్టర్ సుధాకర్ అరెస్ట్ పై హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత.. డాక్టర సుధాకర్ పట్ల పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోలను జత చేసి కోర్టుకు పంపటంతో కోర్టు సుమోటోగా స్వీకరించింది. కేసుపై విచారణ సందర్భంగా కీలక ఉత్తర్వులిచ్చింది. విచారణ సమయంలో సుధాకర్‌ను కోర్టు ముందు హాజరు పర్చాలని హైకోర్టు ఆదేశించింది. మెరుగైన చికిత్స కోసం, ఆసుపత్రిలో చేర్చిన విషయాన్ని ప్రభుత్వం హై కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. దీనితో విశాఖ సెషన్స్ జడ్జి నేరుగా సుధాకర్ ఉన్న ఆసుపత్రికి వెళ్లి, వాంగ్మూలం నమోదు చేయాలని ఆదేశించింది.
రేపు సాయంత్రంలోగా వాంగ్మూలాన్ని హైకోర్టుకు సమర్పించాలని సూచించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ తో పాటు విడియో క్లిపింగ్స్ ను పిటిషనర్ తరుపు న్యాయవాదికి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. వైద్య సిబ్బందికి మాస్కులు లేవని ఆరోపించి, సస్పెండైన డాక్టర్ సుధాకర్‌ను..... శనివారం విశాఖపట్నంలో జాతీయ రహదారిపై గొడవ చేస్తున్నారని పోలీసులు అరెస్టు చేయడం కలకలం సృష్టించింది.
స్థానికుల ఫిర్యాదుతో అక్కడికి వెళ్లిన పోలీసులతో పాటు ఏపీ సీఎంను సైతం తిట్టడంతో.. డాక్టర్ సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విధులకు ఆటంకం కలిగించినందుకు 353, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.వైద్యుడిని కొట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్ మధుబాబును సస్పెండ్~ చేశారు. సుధాకర్ మానసిక పరిస్థితి బాగోలేదని కేజీహెచ్ వైద్యులు చెప్పడంతో.. పోలీసులు ఆయనను గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్ కు తరలించారు. మాస్కులు లేవని సుధాకర్ ఆరోపించడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఆయన్ను సస్పెండ్ చేసింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)