సీమలో అసంతృప్తితో రగిలిపోతున్న టీడీపీ నేతలు...

సీమలో అసంతృప్తితో రగిలిపోతున్న టీడీపీ నేతలు...

జంబో కమిటీ వేసినా తెలుగు తమ్ముళ్లలో సంతృప్తి లేదా? జిల్లాల్లో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయా? పదవులు పొందిన వారిది ఒక బాధ.. పదవులు దక్కని వారిది మరో ఆవేదనగా ఉందా? లెట్స్‌ వాచ్!

జంబో కమిటీలలోనూ చోటు దక్కని నేతల అసంతృప్తి!

2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ ఏ కార్యక్రమం చేసినా అంతగా కలిసి రావడం లేదన్నది తెలుగు తమ్ముళ్లలో వినిపించే మాట. దాని వెంటే సమస్యలు వస్తున్నాయట. వీటిని గమనించిన చంద్రబాబు..  ఎన్నడూ లేని విధంగా జంబో కమిటీలను ప్రకటించారు.  అడిగిన వారికి లేదన్నట్టుగా పార్టీ పదవులు కట్టబెట్టారు.  ఈ కమిటీలు వేసింది చంద్రబాబేనా అన్నట్టుగా ఆశ్చర్యపోయారు పార్టీ నాయకులు. ఇంత కసరత్తు చేసినా.. జంబో కమిటీలో చోటు దక్కని నేతలు ఇంకా ఉండిపోయారట. వారంతా ఇప్పుడిప్పుడే తమ అసంతృప్తిని బయట పెడుతుండటంతో టీడీపీలో చర్చ మొదలైంది.

కదిరి, ధర్మవరం, పుట్టపర్తి నేతలకు పదవుల్లేవట!

ఈ కష్టకాలంలోనూ అనంతపురం జిల్లాకు చెందిన కేడర్‌ టీడీపీ వెంటే ఉంది. రాష్ట్ర, జాతీయ కమిటీలు ప్రకటించే సమయంలో జిల్లాను మొత్తం పరిగణనలోకి తీసుకోకుండా కొన్ని నియోజకవర్గాలకే ప్రాధాన్యం ఇచ్చారన్నది తమ్ముళ్ల ఆరోపణ. దీంతో పదవులు దక్కని వారు ఎందుకిలా జరిగిందా అని ఆరా తీస్తున్నారట. తామేంటో.. తమ పనితనం ఏంటో చంద్రబాబుకు తెలుసు.. అయినా పదవులు రాకుండా అడ్డుకుంది ఎవరా అని ప్రశ్నించుకుంటున్నారని సమాచారం. టీడీపీకి పట్టున్న కదిరి, ధర్మవరం, పుట్టపర్తి ప్రాంతాలకు చెందిన  టీడీపీ నాయకులకు పదవులు  దక్కలేదట. 

పదవులు దక్కిన వారిలోనూ అసంతృప్తేనా?

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పదవులు వచ్చిన వారిది మరో బాధగా ఉందట. కమిటీలలో తమకు తగిన గౌరవప్రదమైన పదవి ఇవ్వలేదని అనుచరుల దగ్గర వాపోతున్నారట. ఎవరి గోల ఎలా ఉన్నా.. పైరవీలు చేసుకున్నవారికే పదవులు, మంచి పోస్టులు దక్కాయని చెవులు కొరుక్కుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 

అసంతృప్తి నేతలకు బుజ్జగింపులు!

ఇక నెల్లూరు జిల్లా నుంచి టీడీపీ కేంద్ర, రాష్ట్ర కమిటీలలో 15 మంది నాయకులకు చోటు దక్కింది. పొలిట్‌బ్యూరో, కేంద్ర పార్టీ కార్యదర్శి, ఉపాధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధులు ఇలా ఆయా విభాగాలలో నాయకులు అవకాశం కల్పించారు చంద్రబాబు. అయితే... ఏ కమిటీలోనూ ఛాన్స్‌ లభించని వారు మాత్రం రగిలిపోతున్నట్టు సమాచారం. మాజీ మంత్రి రమేష్‌రెడ్డి, ఆయన భార్య మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ తాళ్లపాక అనురాధలు రాజీనామా చేసినట్టు చెబుతున్నారు. అనురాధ గతంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చేశారు. ఇప్పుడు ఏ పదవీ ఇవ్వలేదు. విషయం తెలిసి రమేష్‌రెడ్డి దంపతులను పార్టీ నాయకులు బుజ్జగిస్తున్నారట. 

కావలి, ఉదయగిరి, ఆత్మకూరు నేతలకు పదవులు లేవా? 

జిల్లాలో టీడీపీ నాయకుల్లో చురుకుగా ఉండే ఆనం జయకుమార్‌రెడ్డికి సైతం ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఆయన కూడా అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తారని సమాచారం. జయకుమార్‌రెడ్డి సోదరులు వైసీపీలోకి వెళ్లినా.. ఆయన మాత్రం టీడీపీని వీడలేదు. అయితే.. జయకుమార్‌రెడ్డికి పదవి ఇస్తే భవిష్యత్‌లో తమకు పోటీగా వస్తారని నెల్లూరు సిటీ, రూరల్‌ నేతలు అడ్డుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విధంగా కావలి, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గం నేతలు సైతం తమకు పార్టీ పదవుల్లో అవకాశం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ ఇదే విధమైన పరిస్థితి ఉందట. మరి చంద్రబాబు వీటికి ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.