పాతబస్తీలో అమిత్‌షా ఎన్నికల ప్రచారం.. భారీగా కేంద్ర బలగాలు !

పాతబస్తీలో అమిత్‌షా ఎన్నికల ప్రచారం.. భారీగా కేంద్ర బలగాలు !

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి ఫైనల్ పంచ్ ఇచ్చేందుకు నగరానికి వస్తున్నారు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా. ఇవాళ చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఆయన ప్రచారం ప్రారంభం కానుంది. అమిత్‌షా నగరంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. గ్రేటర్ ప్రచారంలో జోష్‌ మీదున్న బీజేపీ.. అమిత్‌షా పర్యటనను సక్సెస్ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.  చివరి రోజు కావడంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఉదయం పదిన్నరకు ఆయన నగరానికి వస్తారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి వెళతారు.

భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన తర్వాత సనత్‌ నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు. రెండు గంటలకు బీజేపీ ఆఫీసులో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడతారు.  తర్వాత పార్టీ నాయకులతో మాట్లాడి ప్రచారం, పోలింగ్ రోజున కార్యాచరణపై సమీక్షిస్తారు. ఏడు గంటలకు విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళతారు. అమిత్‌షా రోడ్‌షో సందర్బంగా... నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.  అమిత్‌షా భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తూ ఉండటంతో.. పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది  పోలీస్ విభాగం. నగరంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని తమకు సమాచారం ఉందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అమిత్‌షా పర్యటన సమయంలో అల్లర్లు జరక్కుండా ఓల్డ్ సిటీ అంతటా భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పోటా పోటీ గా పోటీ పడిన బీజేపీ శ్రేణులు.. అమిత్  షా రాకతో ఉత్సాహంతో ఉన్నాయి.