ఇక కోరుకున్న రోజున అమెజాన్ డెలివరీ

ఇక కోరుకున్న రోజున అమెజాన్ డెలివరీ

ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో వినియోగదారులను ఆకట్టుకొనే ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. తన అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎప్పుడు కోరుకొంటే అప్పుడు డెలివరీ అనే అదిరిపోయే ఆఫర్ తెచ్చింది. ఇన్నాళ్లూ ప్రైమ్ మెంబర్స్ కి వెంటనే డెలివరీ, ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, ఫస్ట్ యాక్సెస్ వంటి అదనపు ప్రయోజనాలు ఇస్తూ వచ్చింది అమెజాన్. ఇప్పుడు అమెజాన్ తన ప్రైమ్ మెంబర్స్ కోసం ఆ జాబితాలోనే మరో ప్రయోజనాన్ని చేర్చింది. ప్రైమ్ మెంబర్స్ ఇకపై తమ ఆర్డర్లను ఏ డెలివరీ రోజు కోరుకుంటారో ఆ రోజే అందించేలా 'అమెజాన్ డే' అనే కొత్త ఫీచర్ ను అధికారికంగా ప్రవేశపెట్టింది.

తమ అవసరాలకు అనుగుణంగా డెలివరీ రోజును ఎంచుకోవడమే కాదు, ప్రైమ్ మెంబర్స్ తమ ఒక్కో ఆర్డర్ కి ఒక్కో డబ్బా కాకుండా అన్ని ఆర్డర్లూ కలిపి ఒకే డబ్బాలో పొందేలా ఎంచుకోవచ్చు. మీరు వారమంతా మీకు కావాల్సిన వస్తువులను జోడిస్తూ పోవచ్చు. కంపెనీ అన్నిటిని కలిపి మీరు కోరుకున్న రోజు అంటే అమెజాన్ డే నాడు డెలివరీ ఇస్తుంది. అంతే కాదు. ప్రైమ్ యూజర్లు ఒక డిఫాల్ట్ డెలివరీ డేట్ ను ఎంపిక చేసుకోవచ్చు లేదా చెకౌట్ అయ్యే సమయంలో తమ అమెజాన్ డేని మార్చుకోవచ్చు. ఇంకా ప్రైమ్ యూజర్లు వన్-డే డెలివరీ, టూ-డే డెలివరీ, తొందరలేని డెలివరీలను కూడా కోరవచ్చు. తమ డెలివరీలని వేర్వేరుగానూ తీసుకోవచ్చు లేదా అన్నిటినీ కలిపి తీసుకోవచ్చు లేదా ఆయా వస్తువుల ప్రకారం ప్యాకింగ్ చేయాలని సూచించవచ్చు.

కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ వల్ల యూజర్లు తమకు సౌకర్యవంతమైన రోజున డెలివరీ అందుకొనేలా ప్లాన్ చేసుకోగలుగుతారు. అలాగే కంపెనీ కూడా ప్యాకేజింగ్ వ్యర్థాలను తగ్గించుకొనడం వీలవుతుంది. అమెజాన్ ఈ అమెజాన్ డే ఫీచర్ ని గత నవంబర్ లో పరిమిత ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశపెట్టింది. దీని ద్వారా కంపెనీ కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించడంతో పాటు 2030 నాటికి తన సగం షిప్ మెంట్స్ కార్బన్ ని సున్నా చేయడం లక్ష్యంగా పెట్టుకొంది. 

అయితే ఈ అమెజాన్ డే ఫీచర్ ప్రస్తుతం అమెరికాలోని అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రమే లభ్యం కానుంది. మీరు ప్రపంచంలో మరే ప్రాంతంలో ఉన్నా..యుకె, ఆస్ట్రేలియా, ఇండియా లేదా ఇతర దేశాల వారు మాత్రమే ప్రస్తుతం ఉన్న ప్రత్యామ్నాయాల నుంచే డెలివరీ డేట్ ఎంచుకోక తప్పదు.