ప్రజలు ఎవరూ భయపడాల్సిన పని లేదు : ఏపీ ఆరోగ్య మంత్రి

ప్రజలు ఎవరూ భయపడాల్సిన పని లేదు : ఏపీ ఆరోగ్య మంత్రి

నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కరోనాకు సంబంధించి కీలక కామెంట్స్ చేశారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకొంటోందన్న ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సూచనలిస్తున్నారని అన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా అత్యధిక పరీక్షలు చేస్తున్నామన్న ఆయన దేశంలోనే అత్యధికంగా పరీక్షలు చేస్తూ వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. రికవరీ రేట్ కూడా అధికంగా ఉందన్న మంత్రి కోవిడ్ కోసం ప్రతి నెలా 350 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోందని అన్నారు. ఆసుపత్రులలో బాధితులకు మెరుగైన వసతులు కల్పించి సేవలందిస్తున్నామని అందుకే ప్రజలు ఎవరూ భయపడాల్సిన పని లేదని అన్నారు. ప్లాస్మా థెరపీ పై ఎలాంటి అపోహలు వద్దన్న ఆయన కరోనా నుండు కోలుకున్న వారు ప్లాస్మా దానం కోసం ముందుకు రావాలని కోరారు. ప్లాస్మా దానం చేసే వారికి రూ.5 వేల ప్రోత్సాహకాన్ని ఇస్తున్నామని కరోనాని పూర్తిగా పారద్రోలే వరకూ ప్రజలు కరోనా నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. స్వర్ణ ప్యాలస్ ఘటన పై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.