రివ్యూ: 'అల వైకుంఠపురములో..'

రివ్యూ: 'అల వైకుంఠపురములో..'

నటీనటులు: అల్లు అర్జున్, పూజ హెగ్డే, సుశాంత్, నివేతా పేతురాజ్, మురళీశర్మ, టబు, నవదీప్ తదితరులు
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు: ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్

ఇప్పటికే అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, స‌న్నాఫ్ స‌త్యమూర్తి సూపర్ హిట్ కావడం.. మరో సారి 'అల వైకుంఠపురములో..'తో ఈ కాంబో రిపీట్ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి... మరోవైపు డీజే, నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా మూవీలు మిశ్రమ ఫలితాలు ఇవ్వడంతో కాస్త గ్యాప్ తీసుకున్న బన్నీ 'అల వైకుంఠపురములో..'తో సంక్రాంతి బరిలో నిలిచాడు... ఇక, ఇప్పటికే ఈ మూవీ సాంగ్స్ అందరి నోట వినిపిస్తున్నాయి... చిన్నా పెద్ద తేడా లేకుండా ఈ పాటలు పాడేస్తున్నారు... ఈ మూవీ  సాంగ్స్ యూ ట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. మరి భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
ఇక కథలోకి వెళ్తే బంటు (అల్లు అర్జున్) అంటే మొదటినుండి తన తండ్రి వాల్మీకి (మురళీ శర్మ)కి పడదు. తనకు కావాల్సింది ఇవ్వకపోవడం, సరిగ్గా చూడకపోవడం చేస్తూ ఉంటాడు. చిన్నప్పటినుండి అదే ఒత్తిడితో పెరిగిన బంటుకు నాన్నంటే విపరీతమైన కోపం... అయితే, తన బాస్ (పూజ హెగ్డే)ను చూసి ప్రేమలో లవ్‌లో పడిపోతాడు.. మరోవైపు రామ చంద్ర (జయరాం) తన కొడుకు సుశాంత్‌కు పూజ హెగ్డేను ఇచ్చి పెళ్లి చేసే ప్లాన్‌లో ఉంటాడు.. రామ చంద్ర బిజినెస్‌పై కన్నేసిన విలన్ (సముద్రఖని) అతనిపై దాడి చేయిస్తాడు. అయితే, అది అటూఇటు తిరిగి బంటుకి తన జీవితంలో జరిగిన అతిపెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. దాంతో జయరాం అండ్ ఫ్యామిలీ నివాసం ఉండే వైకుంఠపురము (వాళ్ల ఇల్లు)కి వెళ్తాడు బంటు.. అయితే, వైకుంఠపురములో బంటుకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? అక్కడ బంటుకి తెలిసిన నిజాలేంటి..? అసలు ఎందుకని వాళ్ల నాన్న బంటుని ద్వేషిస్తాడు.. బాస్‌తో ప్రేమాయణం ఎలా ఉంటుంది? త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ ఎలా ఉన్నాయి..? వాటిని బన్నీ  ఎలా పండించాడు లాంటివి స్క్రీన్ పై చూస్తేనే ఓ కిక్కు ఉంటుంది.

పాత్రలు: 
నటీనటుల విషయానికి వస్తే.. డ్యాన్స్‌లు అయినా, ఫైట్లు అయినా అల్లు అర్జున్‌కు కొట్టినపిండి... ఎలాంటి స్టెప్పులైనా ఈజీగా చేసే బన్నీకి తన కెరీర్‌లో అన్ని ఎమోషన్స్ కలగలిసిన మరో పాత్ర ఈ సినిమా ద్వారా దక్కిందనే చెప్పాలి. కామెడీ పరంగా, ఎమోషన్స్ పరంగా తాను బెస్ట్ అని ఈ సినిమాతో అనిపించుకున్నాడు బన్నీ. ఇక, ఫైట్స్ కుమ్మేసిన బన్నీ, డ్యాన్సుల్లో చాలా స్టైలిష్‌గా ఆకట్టుకున్నాడు. బన్నీకి పెర్ఫార్మెన్స్ పరంగా మరో మంచి సినిమా ఇది. హీరోయిన్‌గా పూజ హెగ్డేకు నామ మాత్రపు పాత్రే అనాలి... కానీ, తన గ్లామర్‌తో కట్టిపడేసింది. ఇక, సుశాంత్‌కు కూడా పెర్ఫార్మన్స్ స్కోప్ పెద్దగా లేదు. నివేతా పేతురాజ్, టబు కథలో భాగమైనా కూడా వాళ్లకు లిమిటెడ్ పాత్రలే దక్కాయనాలి. మరోవైపు హీరో తండ్రి పాత్రలో మురళి శర్మ ఎంతో మెప్పించాడు. మలయాళ నటుడు జయరాం తన పాత్రకు న్యాయం చేశారు.. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్స్‌లో హావభావాలు పండించాడు. సచిన్ ఖేద్కర్ కు మంచి పాత్ర పడగా... సునీల్, హర్షవర్ధన్ లాంటి నటులు పెద్దగా చేసిందేమీలేదనే చెప్పుకోవాలి. 

అల వైకుంఠపురములో సాంకేతికంగా చాలా ఉన్నతంగా తెరకెక్కించాడు దర్శకుడు.. సినిమాటోగ్రఫీ టాప్ లెవెల్‌లో ఉంది. విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి... ఇక, సమజవరగమన పాటలో పారిస్ అందాలు, బుట్ట బొమ్మ చిత్రంలో అద్భుతమైన సెట్ వేశారు. మరోవైపు పాఠల విషయానికి వస్తే అందరినీ నోళ్లలో అవే పాటలు... థమన్ కెరీర్‌లో ది బెస్ట్ ఆల్‌బామ్‌గా నిలిచిపోనుంది. థమన్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కూడా మెప్పించాడు థమన్. అయితే, సెకండ్ హాఫ్‌లో కత్తెరకు కొంత పనిచెప్పాల్సింది.. కొంచెం ల్యాగ్ వచ్చిన ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతోంది. ఇక, కథ పరంగా మరోసారి త్రివిక్రమ్ పాత పాయింట్‌నే తీసుకున్నా.. తనదైన శైలి డైలాగ్స్, ట్రీట్మెంట్‌ ఇవ్వడంలో విజయం సాధించాడు.

విశ్లేషణ:
కథ కూల్‌గా సాగిపోతోంది... సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్ సినిమాకు ప్లస్‌గా నిలుస్తాయి... అయితే, పెద్దగా విలనిజం లేకపోవడం, రొటీన్ అనిపించే వ్యవహారం మైనస్‌లు తోస్తాయి. పాత కథే అయినా.. తన రచనతో ఈ పాయింట్ కు బలాన్ని తీసుకొచ్చాడు త్రివిక్రమ్.. కానీ, తర్వాత సీన్‌ ఏంటి? అనేదానిపై ప్రేక్షకులు ముందే ఒక అంచనాకు వచ్చేలా ఉన్నాయి... బన్నీ నటన, డ్యాన్స్‌లు, ఫైట్లు, థమన్ మ్యూజిక్ ఈ సినిమాకు ఎంతో ప్లస్‌గా చెప్పాలి.. మొత్తానికి అల వైకుంఠపురములో ఫ్యామిలీ వెళ్లి చూడాల్సిన చిత్రమే...