అక్కడ మగవాళ్ళే పొంగళ్ళు పెడతారు… ఎందుకో తెలుసా ?

అక్కడ మగవాళ్ళే పొంగళ్ళు పెడతారు… ఎందుకో తెలుసా ?

ఆ ఆలయంలోకి ఆడవాళ్లకు నో ఎంట్రీ.. మగవాళ్లకు మాత్రమే అక్కడ ప్రవేశం..  పూజలూ, పునస్కారాలు కూడా మగవారివే.. నైవేద్యం తయారీ, అభిషేకాలు వారివే.. చివరకు తీర్థప్రసాదాలు వారికే.. మహిళలది అక్కడ ప్రేక్షక పాత్ర మాత్రమే.. సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం అక్కడ మగవారి హడావుడి అంతా ఇంతా కాదు.. ఆరు దశాబ్దాలుగా అక్కడి గ్రామస్ధులు ఆచరిస్తున్న ఈ వింత ఆచారంపై ఒక లుక్ వేద్దాం. సాధారణంగా ఎక్కడైనా సరే గుళ్లూ, ఆలయాల్లో దేవుళ్లు, దేవతలకు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకునేది ఆడవాళ్లే.. కానీ ఇక్కడంతా రివర్స్ లో వుంటుంది యవ్వారం.

జంబలకిడి పంబ టైపులో ఇక్కడ మగాళ్లు మాత్రమే పొంగుబాళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. అనాధిగా వస్తున్న ఈ వింత ఆచారాన్ని కడపజిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ప్రతి యేడూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అక్కడి గ్రామస్తులు. సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తుంది. కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలోని శ్రీ సంజీవరాయస్వామి ఆలయం ఇది. ఇక్కడ అంతా మగవారే కనిపిస్తున్నారేమిటన్న అనుమానం కలుగుతోంది కదూ.. అవును ఇక్కడ ఈ ఒక్కరోజు వీరిదే హడావుడి.. ప్రతియేటా ఇలా మగవారంతా కలిసి వరుసగా గరిటెలు చేతపట్టుకుని నలభీముల క్యారెక్టర్ పోషిస్తుంటారు. 

పేద్ద మాస్టర్ ఛెఫ్పుల్లా ఫోజులిస్తుంటారు. వంట చేయడం రాకపోయినా ఆచారం కోసం తప్పక తిప్పలు పడుతుంటారు.  ఏడాదికోమారు గ్రామంలో జరిగే ఈ పొంగళ్ల ఉత్సవంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొంటారు. ఇక్కడి సంజీవరాయస్వామి ఆలయంలో సంక్రాంతి పండుగ ముందు వచ్చే ఆదివారం నాడు పొంగళ్ల ఉత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటారు. వృత్తిపరంగా, వ్యాపారాల రీత్యా ఎక్కడ ఉన్నా.. ఏ స్థాయిలో ఉన్నా ఈ పొంగళ్ల ఉత్సవాలకు తప్పక హాజరవుతారు. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు మిగతా ప్రాంతాల నుంచి కూడా  భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు.  

తిప్పాయపల్లెలోని సంజీవరాయస్వామి ఆలయానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ పేరుకే గానీ సంజీవరాయుడి విగ్రహమంటూ ఏమీ లేదు. ఓ రాతిని ప్రతిష్ఠించి దానిపై శాసనం చెక్కారు.  రాయిపై చెక్కిన శాసనాన్నే నేటికీ సంజీవరాయుడిగా భావిస్తూ ఇక్కడి ప్రజలు ఆ రాయికి పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇది మగవాళ్లు మాత్రమే పూజించే గుడి ఎందుకయ్యిందనే దానికి ఇక్కడి వారికి ఓ లెక్కుంది. కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఓ బ్రాహ్మణుడు తిరుగుతూ ఉండేవాడని, పురుషులతో తప్ప స్త్రీలతో ఆ బ్రాహ్మణుడు అసలు మాట్లాడేవాడే కాదని ఇక్కడి గ్రామస్థులు చెబుతుంటారు. ఆయన ఆ గ్రామం నుంచి వెళ్లిపోతూ ఓ శిలను నాటి దానిపై లిపిని రాసి.. గ్రామం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం స్వామికి గ్రామంలోని మగవారే పొంగుబాళ్లు పెట్టాలని చెప్పారట.. అప్పటి నుంచీ ఆ బ్రామ్మణుడు చెప్పిన మాటను ఇక్కడి గ్రామస్తులు పాటిస్తూ వస్తున్నారు. రాను రాను అదే ఆ గ్రామ ఆచారంగా మారిపోయింది.

ఉదయాన్నే ప్రారంభమయ్యే పొంగళ్ల ఉత్సవంలో పాల్గొనేందుకు మగవాళ్లు పెద్దసంఖ్యలో హాజరవుతారు. పొంగళ్ల ఉత్సవం రోజున గ్రామంలోని మహిళలు తెల్లవారుఝామునే లేచి, కళ్లాపు చల్లి అందమైన రంగవళ్లులతో గ్రామంలో ఉత్సవశోభను తీసుకొస్తారు. ఇక మగవాళ్లంతా పొంగళ్లు పెట్టేందుకు అవసరమైన బియ్యం, బేడలు, బెల్లంతో పాటు కట్టెలు కూడా స్వయంగా ఇంటినుంచి తెచ్చుకొని తామే స్వయంగా నైవేధ్యాన్ని వండుతారు. అనంతరం  మగవాళ్లంతా కలిసి మూలవిరాట్టును పూలతో అందంగా అలంకరించి, అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు చేసి తాము స్వయంగా వండిన నైవేద్యాన్ని స్వామికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఆంజనేయుడు స్వచ్చమైన బ్రహ్మచారి కావడంతో ఈ ఆలయంలోకి మహిళలకు ప్రవేశాన్ని నిషేదించినట్లు పెద్దలు చెబుతారు. 

సంజీవరాయుడి ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేకపోయినప్పటికీ.. గ్రామంలోని ఆడవారందరూ మగవారితో పాటు ఆలయం వద్దకు చేరుకుంటారు. గర్భగుడిలోకి ప్రవేశం లేకపోయినప్పటికీ మహిళలు పొంగళ్ల పండుగను కనులారా వీక్షించేందుకు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుంటారు. పూర్వం నుంచి వస్తున్న ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ తమ ఇంటి మగవారి చేత పొంగళ్లు పెట్టిస్తారు. తమ కుటుంబాలు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తారు. ఎన్ని పనులున్నా.. ఎక్కడ ఉన్నా పొంగళ్లు పెట్టే సమయానికి రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోతారు. ఆలయం ద్వారం నుంచే స్వామివారిని దర్శించుకుంటారు. మొక్కులు కూడా ద్వారం వద్ద నుంచే మొక్కుకుని అటునుంచి అటే వెళ్లిపోతారు. అయితే ఇక్కడ మహిళలకు ప్రవేశం లేకపోయినప్పటికీ.. పదేళ్లలోపు అమ్మాయిలకు మాత్రం ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తారు. చిన్న పిల్లలు మాత్రం స్వామివారిని దర్శించుకోవచ్చు.