ఏపీలో మళ్ళీ పోలవరం రగడ..

ఏపీలో మళ్ళీ పోలవరం రగడ..

పోలవరంపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష జరిపారు. ప్రాజెక్ట్‌ నిధులపై మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు. మరోవైపు... పోలవరంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. పోలవరం ప్రాజెక్టుకు పాత అంచనా వ్యయం ప్రకారమే నిధులిస్తామంటూ కేంద్ర ఆర్థిక శాఖ సంకేతాలివ్వడంతో... తాజా పరిణామాలను సమీక్షించారు... సీఎం జగన్. కేంద్రం 2014 అంచనాలనే ఆమోదిస్తే... పరిస్థితి ఏంటన్న దానిపై చర్చించినట్లు సమాచారం. సమీక్షకు హాజరైన మంత్రులు అనిల్ కుమార్, బుగ్గన రాజేంద్రనాథ్... మీటింగ్‌ తర్వాత స్పందించలేదు.

విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అయినా... కమిషన్ల కోసం కక్కుర్తిపడిన ఆనాటి సీఎం చంద్రబాబు తామే కట్టుకుంటామని చెప్పారని... అప్పుడాయన ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే.. వ్యయం ఎంతైనా కేంద్రమే ప్రాజెక్టు పూర్తి చేసేదని మంత్రి కన్నబాబు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ కేంద్రానికి రాసిన లేఖల వల్లే పోలవరానికి నిధులు తగ్గిస్తామని ఆర్థికశాఖ చెబుతోందని ఇప్పుడు 30 వేల కోట్ల నష్టం వాటిల్లిందని టీడీపీ మండిపడింది. కేసుల మాఫీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టే అధికారం జగన్‌కు లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంపై పొలిటికల్‌ ఫైట్‌ మళ్లీ మొదలవడంతో... ఇది ఇంకా ఏ స్థాయికి చేరుతుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.