కుర్రకారుకు దిగిపోని నిషా... త్రిష!

కుర్రకారుకు దిగిపోని నిషా... త్రిష!

తమిళనాట పుట్టినా, తెలుగు చిత్రాలతోనే భలేగా వెలుగు చూసింది త్రిష. 'నీ మనసు నాకు తెలుసు' అంటూ వచ్చినా, 'వర్షం'లో తడుస్తూనే కుర్రకారులో తపనలు రేపింది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' అంటూ మరింతగా కవ్వించింది. ఇంకేముంది? ఎంతోమంది రసికాగ్రేసరులు త్రిషను తమ కలలరాణిగా పట్టాభిషేకం చేసి ఆనందించారు. త్రిష సినిమా అంటే చాలు అది ఎలాగున్నా, చూసేసి అందులోని ఆమె అందాల విందును కనులారా లాగించేసి మైమరచిపోయేవారు. అలా  త్రిష అందాల అభినయం తెలుగువారిని విశేషంగా అలరిస్తూ సాగింది. 

టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తో నటించిన త్రిష పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేశ్, జూ.యన్టీఆర్, రవితేజ, గోపీచంద్ వంటి యంగ్ స్టార్స్ తోనూ కనువిందు చేసింది. తెలుగులో ఈ మధ్య త్రిష కనిపించడం తగ్గింది. కానీ, ఆమె నటించిన తమిళ చిత్రాలను సైతం చూసి ఆనందిస్తున్నారు తెలుగుజనం. ఆ మధ్య వచ్చిన తమిళ చిత్రం '96' అక్కడ మంచి విజయం సాధించింది. గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలో తెలుగువారు ఈ  తమిళ చిత్రాన్నే చూసి భలేగా ఆనందించారు. దీని రీమేక్ గా తెలుగులో వచ్చిన 'జానూ' మన జనాన్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీనిని బట్టే త్రిష కాసింత అందంగా కనిపిస్తే చాలు కనువిందు చేస్తుందనే నమ్మకంతో ఎంతోమంది తెలుగువారు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే త్రిషకు తగ్గ కథలేవీ తెలుగులో లభించడం లేదు. దాంతో ఆమె అనువాద చిత్రాలతోనే సంతృప్తి చెందవలసిన పరిస్థితి ఏర్పడింది. కరోనా కారణంగా మళ్ళీ సినిమాల విడుదలకు బ్రేక్ పడింది. మరోమారు ఓటీటీ ఫ్టాట్ ఫామ్స్ లో త్రిష చిత్రాలు చూసి జనం పులకించి పోతారని చెప్పవచ్చు. ఏది ఏమైనా త్రిష అందం ఈ నాటికీ హిందోళం పాడుతోందనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు.