ప్రయోగాలతో పయనించిన జేడీ చక్రవర్తి!

ప్రయోగాలతో పయనించిన జేడీ చక్రవర్తి!

చూడగానే బాగా పరిచయమున్న ముఖం అనిపిస్తుంది. ఆ నవ్వులో వంకర కనిపిస్తుంది. అందులో కొంటెదనం చిందులేస్తుంది. చూపులో కోపం కనిపించినప్పుడు రాక్షసుడు అనిపిస్తాడు. ఆ కళ్ళలో ప్రేమ చోటు చేసుకుంటే మనవాడే అనిపించకమానడు. వెకిలి నవ్వులు, వంకరచేష్టలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, కొట్టడం, కొట్టించుకోవడం, చంపడం, నరకడం- ఇలా పలు కృత్యాలు తెరపై ఆవిష్కరించి ప్రేక్షకుల మదిలో జేడీగా నిలిచాడు శ్రీనివాస చక్రవర్తి. పదిహేడేళ్ళ ప్రాయంలోనే తెరపై కనిపించి, కనికట్టు చేశాడు. అతనేమీ నటుల వారసుడు కాదు, నటించాలన్న అభిలాష  కలిగింది, అదృష్టం కలసి వచ్చి 'శివ' సినిమాలో జేడీగా నటించి ఆకట్టుకున్నాడు. ఆ తరువాత నుంచీ సినిమాల్లోనే జీవనం సాగించాడు జేడీ. రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం 'శివ'లో జె.దుర్గారావు పాత్రలో కనిపించి, జేడీగా అలరించి, దానినే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి అయినా, జేడీ చక్రవర్తిగానే జనానికి సుపరిచితుడు. 

చిరంజీవి మెచ్చిన జేడీ!

'శివ'లో బ్యాడ్ బోయ్ గా కనిపించిన చక్రవర్తి, తరువాత కొన్ని సినిమాల్లో రాముడు మంచిబాలుడు అన్న పాత్రలనూ పోషించి, ఆకట్టుకున్నాడు. ఆరంభంలో జేడీ చక్రవర్తి తెరపై కనిపిస్తే చాలు అమ్మాయిలు రౌడీగాడు అనుకొనేవారు. ఈ రౌడీ అబ్బాయే తరువాతి రోజుల్లో ఎంతోమంది మగువల  కలల రేడు కూడా అయ్యాడంటే ఆశ్చర్యం కలుగక మానదు. గురువు రామ్ గోపాల్ వర్మ బాటలోనే దర్శకుడు కావాలని కలలు కన్నాడు జేడీ. అతని దర్శకత్వంలో 'ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాత్మ'ను నిర్మించాలని ఆశించాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా షూటింగ్ ముహూర్తం సికిందరాబాద్ లో ఎంతోమంది రసికుల అభిమాన థియేటర్ అయిన లాంబాలో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చిరంజీవి కూడా "టీవీలో జేడీ చక్రవర్తి పాట వస్తోందంటే, అమ్మాయిలు పరుగులు తీసి మరీ చూడటం నేను చూశాను" అని చెప్పారు. దీనిని బట్టే, ఆ రోజుల్లో జేడీకి ఎంత క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే జేడీ దర్శకత్వంలో ఆరంభమైన 'ఆటోబయోగ్రఫి ఆఫ్ మహాత్మ' అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అయితేనేమి ఓ వైపు నటనలో కొనసాగుతూనే, మరోవైపు దర్శకత్వంపై దృష్టి సారించాడు జేడీ. 'దుర్గ' అనే చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో స్వీయ దర్శకత్వంలో రూపొందించి, నటించాడు జేడీ. ఆ సినిమా ఆట్టే ఆకట్టుకోలేకపోయింది. తరువాత 'దర్వాజ్ బంద్ రఖో' అనే హిందీ చిత్రం తీశాడు. ఫరవాలేదనిపించాడు. ఆపై తెలుగులో "హోమం, సిద్ధం" చిత్రాలకు దర్శకత్వం వహించాడు. తాను హిందీలో తీసిన 'దర్వాజ్ బంద్ రఖో' చిత్రాన్నే తెలుగులో "మనీ మనీ మోర్ మనీ" అనే టైటిల్ తో రూపొందించాడు. అదీ అంతే సంగతులు అనిపించింది. 'వన్ బై టు, ఎగిరే పావురమా' వంటి చిత్రాలలో  శ్రీకాంత్ తో కలసి నటించాడు జేడీ. వారిద్దరూ మంచి మిత్రులుగా సాగారు. తన మిత్రుడు శ్రీకాంత్ తో కలసి నటిస్తూ, 'ఆల్ ద బెస్ట్' అనే మూవీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. అది కూడా ఆకట్టుకోలేకపోయింది. 

ఏదో ఆశ... 

దర్శకత్వం చేయాలని ఆశించిన జేడీకి ఎందుకనో అది అంతగా కలసి రాలేదు. అయితే జేడీ చక్రవర్తి హీరోగా నటించిన 'గులాబి' చిత్రం ద్వారా కృష్ణవంశీ దర్శకునిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. "అనగనగా ఒకరోజు, వన్ బై టూ, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, నేను ప్రేమిస్తున్నాను, ప్రేమకు వేళాయెరా"వంటి చిత్రాలు జేడీ కి విజయాలను అందించాయి. ఇక  గురువు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జేడీ నటించిన 'సత్య' చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఇటు తెలుగులోనూ, అటు హిందీలోనూ 'సత్య'తో జేడీ నటునిగానూ మంచి మార్కులు సంపాదించాడు. అయితే ఆ తరువాత నుంచీ జేడీ చక్రవర్తి ప్రయోగాలకు శ్రీకారం చుట్టి, కమర్షియల్ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. ఆ తరువాత జేడీకి హీరో వేషాలు దూరమయ్యాయి. కానీ, అతను మాత్రమే న్యాయం చేయగలడు అన్న పాత్రలు ఇప్పటికీ అతణ్ణి వెదుక్కుంటూ వెళ్తున్నాయి. ఇక నిర్మాతగానూ జేడీ ప్రయోగాలే చేశాడు. నిర్మాతగా తాను తీసిన తొలి చిత్రం 'పాపే నా ప్రాణం'. ఈ చిత్రం ద్వారా తన మిత్రుడు బి.వి.రమణను దర్శకునిగా పరిచయం చేశాడు. ఈ సినిమాను తొలుత టైటిల్ లేకుండా విడుదల చేశాడు జేడీ. సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయం మేరకు 'పాపే నా ప్రాణం' అన్న టైటిల్ ను నిర్ణయించాడు. అందుకే ఈ సినిమాను తొలుత 'పేరులేని సినిమా' అని జనం పిలిచారు. తరువాత తాను హీరోగా, దర్శకునిగా పనిచేస్తూ 'దుర్గ' నిర్మించాడు జేడీ. అదీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇలా నటునిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా, గాయకునిగా జేడీ తనలోని ప్రజ్ఞను ప్రదర్శిస్తూ సాగాడు. 

పిన్న వయసులోనే తెరపై వెలిగిపోయిన జేడీ చక్రవర్తి, 44 ఏళ్ళ వయసులో పెళ్ళి చేసుకోవడమే అందరినీ ఆశ్చర్య పరచింది. పెళ్ళయిన తరువాత తన దరికి వచ్చిన ప్రతి పాత్రనూ అంగీకరించకుండా, ఆచి తూచి అడుగేస్తున్నాడు జేడీ. ఆయన మళ్ళీ ఏదైనా విలక్షణమైన పాత్రలో నటిస్తే చూడాలని జేడీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి అది ఎప్పుడు సాకారమవుతుందో చూడాలి.

(ఏప్రిల్ 16న జేడీ చక్రవర్తి పుట్టినరోజు)