పరిశ్రమల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

పరిశ్రమల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

పరిశ్రమల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతీ పరిశ్రమకూ ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య కేటాయించేందుకు ప్రభుత్వ కార్యాచరణ సిద్దం చేస్తోంది. పరిశ్రమ ఆధార్ పేరిట ప్రత్యేక సంఖ్య కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల సర్వే కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమ సర్వే 2020 పేరిట సర్వే చేపట్టన్నున్నారు. ఏపీలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న కార్మికులు, విద్యుత్, భూమి, నీరు ఇతర వనరులు, ఎగుమతి, దిగుమతులు, ముడి సరకుల లభ్యత, మార్కెటింగ్ తదితర అంశాలను కూడా తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

మొత్తం 9 అంశాల్లో సర్వే వివరాలను పరిశ్రమల శాఖ సేకరించనున్నది. గ్రామ, వార్డు సచివాలయల ద్వారా రాష్ట్రంలోని పరిశ్రమల సర్వేను ప్రభుత్వం చేపట్టనుంది. మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశ్రమల్లోని వివరాలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేకరించనున్నారు. సమగ్ర పరిశ్రమ సర్వే కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నేతృత్వంలో మరో కమిటీ వేయనున్నారు. అక్టోబరు 15 నాటికల్లా సర్వేను పూర్తి చేయాలని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఉత్తర్వుల్లో పేర్కోన్నారు.