దారుణం.. పసిపాప చేయి నరికిన పాపాత్ముడు

దారుణం.. పసిపాప చేయి నరికిన పాపాత్ముడు

పసిపిల్లలను మనం కంటికి రెప్పలా చూసుకుంటాం. ఎత్తుకునే సమయంలో గట్టిగా పట్టుకునేందుకు సైతం భయపడతాం. అయితే ఓ దుర్మార్గుడు మద్యం మత్తులో ఓ పసిగుడ్డుపై దారుణంగా దాడి చేశాడు. దీంతో ఆ చిన్నారి చేయి తెగిపడింది. ఈ దారుణం ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా అవుపడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పంకజ్‌ అనే వ్యక్తి సాయంత్రం తన ఇంటి ముందు 2 నెలల కుమార్తెతో కలిసి కుర్చీలో కూర్చున్నాడు.ఆ సమయంలో పక్కింట్లో ఉండే గణేష్‌ అనే యువకుడు విపరీతంగా తాగి వచ్చి అతడితో అకారణంగా గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వివాదం పెరగడంతో ఆవేశానికి గురైన గణేష్ ఇంట్లో నుంచి కత్తి తెచ్చి పంకజ్‌తో పాటు పసిపాపపై దాడి చేశాడు. ఈ ఘటనలో పంకజ్ చేతికి తీవ్ర గాయమైంది. అయితే ఆ చిన్నారి చేయి కింద తెగిపడింది. వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు గణేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.