సీఎం జగన్ సొంత జిల్లాలో అభివృద్ధికి అడ్డుపడుతున్న నేత ఎవరు ?

సీఎం జగన్ సొంత జిల్లాలో అభివృద్ధికి అడ్డుపడుతున్న నేత ఎవరు ?

ఆయనో అధికార పార్టీ నేత. ఆ అధికారాన్ని అభివృద్ధిలో కాకుండా పర్సెంటేజీలు వసూలు చేయడంలో చూపిస్తున్నారట. సీఎం సొంత జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు బ్రేక్‌లు వేస్తూ రాజకీయ రచ్చకు కారణమవుతున్నారట. దీంతో ఆ నేత తీరుతో విసిగిపోయిన ఓ సంస్థ ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లబోతున్నట్టు సమాచారం. 

ప్రజాప్రతినిధి ఎంట్రీతో సోలార్‌ ప్రాజెక్టు పరిస్థితి మారిపోయిందా? 

కడప జిల్లా జమ్మలమడుగులో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టును గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకోసం గంగుల నారాయణపల్లి, పొన్నంపల్లి, దొడియం, రామచంద్రాయపల్లె, నక్కోని పల్లె, తలమంచిపట్నం, వద్దిరాల తదితర గ్రామాల్లో దాదాపు 4వేల 500 ఎకరాల భూమిని కేటాయించింది ప్రభుత్వం. ఇంత వరకూ బాగానే ఉన్న.. ఆ నేత ఎంట్రీ ఇచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందట. పారిశ్రామికాభివృద్ధి సరే..  నా సంగతి చూస్తేనే పనులు సాగుతాయి. కాదు కూడదని ఎవరికి చెప్పినా మళ్లీ నా దగ్గరికే రావాలి. గుర్తుపెట్టుకో అని వార్నింగ్‌ ఇస్తున్నారట. 

రూ.4కోట్ల విలువైన సోలార్‌ ప్యానెళ్లు ధ్వంసం!

ఈ ప్రాజెక్టును సోలార్‌ ఇ-డైరెక్ట్‌ అనే విదేశీ కంపెనీ దక్కించుకుంది. తొలి విడతగా 250 మెగావాట్ల పనులను 2016లో ప్రారంభించింది. నాటి నుంచి నేతలకు పర్సెంటేజీలు, విద్యుత్‌ ప్రాజెక్టులో ఉద్యోగాలు, ఇతర అంశాలలో రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. ఓ దశలో తమకు లొంగలేదని ఏకంగా 4 కోట్ల విలువైన సోలార్‌ ప్యానెళ్లను ధ్వంసం చేసి.. రాజకీయ  పెతాపం చూపించారట. దీంతో సదరు కంపెనీ ప్రాజెక్టును నిలిపివేయడానికి నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక.. తిరిగి పనులు మొదలుపెట్టేందుకు ఆ కంపెనీ సిద్ధపడిందని సమాచారం. 

తిరిగి పనులు ప్రారంభించగా అసలు కథ మొదలైందా? 

ప్రాజెక్టులో మిగిలిన 750 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ పనుల పూర్తికి ఫోకస్‌ పెట్టారట. ఇందులో భాగంగా 150 కోట్లతో మూడు 220KV సబ్‌ స్టేషన్లు నిర్మించాల్సి ఉంటుంది. వీటి టెండర్లను టాటా కంపెనీ దక్కించుకుని పనులు మొదలుపెట్టింది. సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయితే విదేశీ సంస్థలకు చెందిన ఐయాన్‌ ఎనర్జీ, స్ప్రింగ్‌ ఎనర్జీ, సాఫ్ట్‌ బ్యాంకులు సోలార్‌ ప్యానెళ్లను బిగించి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభిస్తాయి. ఈ దశలోనే అసలు కథ మొదలైందట. 

రూ.4 కోట్లు పర్సెంటేజీగా ఇచ్చారు?

సబ్‌ స్టేషన్‌ పనులు పూర్తి చేయాలంటే..తమకు పర్సెంటేజీలు ఇవ్వాలని ఆ నేత చేసిన డిమాండ్‌తో సదరు కంపెనీ ఇరకాటంలో పడిందట. ప్రాజెక్టు ఉనికే ప్రమాదంలో పడటంతో సోలార్‌ పవర్‌ యాజమాన్యం.. కాంట్రాక్టర్‌తో రాజీ చర్చలు జరిపి దాదాపు 4 కోట్ల రూపాయలు పర్సెంటేజీ రూపంలో ముట్టజెప్పినట్టు సమాచారం. అయినా సరే  23 కోట్లతో చేపట్టిన సివిల్‌ పనులను పరోక్షంగా అడ్డుకొంటున్నారట సదరు ప్రజాప్రతినిధి. 

ప్రజాప్రతినిధి బెదిరింపులపై టాటా పవర్‌ సీరియస్‌

సివిల్‌ పనుల్లో ఉపయోగించే మిషనరీ మొత్తం కొందరు తమకే ఇవ్వాలని.. మార్కెట్‌ రేట్‌ కంటే రెట్టింపు అద్దెలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారట. ఈ వివాదం మొదలైనప్పుడే కరోనా వ్యాప్తి చెందడంతో పనులు ఆగిపోయాయి. ఇప్పుడు మరో అంశం లేవనెత్తారట. లాక్‌డౌన్‌ సమయంలో మిషనరీకి, లేబర్‌కు పూర్తిగా చెల్లింపులు చేయాలని ఒత్తిడి తెస్తున్నారట ఆ ప్రజాప్రతినిధి. దీంతో బెంబేలెత్తిన నిర్మాణ కంపెనీలు.. తమ వల్ల కాదని పనులు ఆపేశాయట. ఆ ప్రజాప్రతినిధి బెదిరింపులను టాటా పవర్‌  యాజమాన్యం తీవ్రంగా తీసుకున్నట్టు సమాచారం. సదరు ప్రజాప్రతినిధిపై నేరుగా సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

సీఎం సొంత జిల్లాలో అభివృద్ధికి ఎమ్మెల్యే బ్రేక్‌ వేయడంపై చర్చ!

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి  సదరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధి అడ్డుపడటం రాజకీయంగానూ హాట్‌ టాపిక్‌గా మారిందట. ఈ ప్రాజెక్టులో విదేశీ సంస్థలు ఉండటంతో.. ప్రధాన నిర్మాణ పనులను  చేస్తున్న టాటా పవర్ సంస్థ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలి పెట్టకూడదని భావిస్తోందట. సదరు ప్రజాప్రతినిధి తీరు మారకపోతే జిల్లాలో రానున్న మరో రెండు భారీ సోలార్‌ ప్రాజెక్టులపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని టాక్‌. ఆ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.