ప్రభాస్ పేరుతో భారీ మోసం..

ప్రభాస్ పేరుతో భారీ మోసం..

చిత్ర సీమలో మోసాలు జరగడం సర్వసాధారణం. సినిమా అవకాశాలు ఇప్పిస్తామని నటులను, స్టార్ హీరో డేట్స్ ఇప్పిస్తామని నిర్మాతలను మోసగాళ్లు ఇట్టే మోసం చేస్తారు. ఇటీవల ఇదే విధంగా మరో భారీ మోసం జరిగింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో నటించేందుకు సువర్ణ అవకాశమని, ఆసక్తి ఉన్నవారు రిజిస్టర్ చేసుకోండి అంటూ ఓ ముఠా ఔత్సాహికులను మోసం చేసింది. విదేశాలలో చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలో అవకాశాలు ఉన్నాయని ఓ ప్రొడక్షన్ కంపెనీ పేరుతో ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా దీనికి ముందుగా నమోదు చేసుకోవాలని, అందుకోసం కొంత మొత్తం చెల్లించాలని సూచించారు. ప్రభాస్ సినిమాలో అవకాశం అనేసరికి ఔత్సాహికులు ముందు వెనుక ఆలోచించకుండా డబ్బును చెల్లించి నమోదు అయ్యారు. నమోదు అయిన వారికి కొన్ని రోజుల్లో మా కంపెనీ నుంచి మెసేజ్ వస్తుందని, సిద్దంగా ఉండాలని ప్రొడక్షన్ సంస్థ వారు తెలిపారట. దాంతో నమోదు చేసుకున్నవారు ఆ మెసేజ్ కోసం ఎదురుచూస్తున్నారు. చాలా కాలం గడిచినా ఎటువంటి మెసేజ్ రాలేదు. దాంతో తమకున్న అనుమానాన్ని తీర్చుకోవడానికి ఆ ప్రొడక్షన్ హౌస్‌కి వెళ్లి ఆరా తీయగా తాము మోసపోయామని తెలిసిందట. దాంతో వారంతా పోలీసులను ఆశ్రయించారట. ముంబై కేంద్రంగా జరిగిన ఈ మోసంపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రతి ఒక్కరి నుంచి దాదాపు ఐదు వేల నుంచి పదివేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఎదురు చూడాల్సిందే.