ఆ గది చూపిస్తే.. రాజీనామా చేస్తా..!!

ఆ గది చూపిస్తే.. రాజీనామా చేస్తా..!!
ప్రగతి భవన్ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది.  తెరాస, కాంగ్రెస్ ల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. కాంగ్రెస్ నేతల శాశ్వత బహిష్కరణ విషయంలో న్యాయస్థానం తెరాస కు చురకలు అంటించడంతో.. అసలు రగడ మొదలైంది.  పైగా కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర పేరుతో యాత్రలు చేస్తూ.. తెరాస పాలనపై విరుచుకు పడుతుండటంతో.. తెరాస ఎదురుదాడికి దిగేందుకు సిద్ధమైంది.  
తెలంగాణా కోసం పోరాటం చేసింది.. తెలంగాణను తీసుకొచ్చింది తెరాస పార్టీనేనని.. తెరాస పార్టీ లేకపోతె తెలంగాణా వచ్చేది కాదని, టిపీసీసీ పదవికి కారణం గులాబీ పార్టీనే అని కెసిఆర్ ధ్వజమెత్తారు.  150 గదులతో ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ను నిర్మించుకున్నారని ఆరోపించిన ఉత్తమ్ కుమార్ పై కెసిఆర్ విరుచుకుపడ్డారు.  మీడియాతో కలిసి ప్రగతి భవన్ రావాలని, 150 గదులు కాదు 15 గదులు చూపించాలని, 15 గదులు చూపించకపోతే.. ప్రగతి భవన్ ముందు ముక్కును నేలకు రాయాలని, అలా కాకుండా 16 గదిని చూపిస్తే.. తాను ముక్కును నేలకు రాయడం కాదని, ఏకంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు కెసిఆర్.  గతంలో మహారాష్ట్రతో ఒప్పందాల విషయంలో కూడా ఉత్తమ్ కుమార్ ఇలాగే ఆరోపణలు చేసి భంగపడ్డారు.  ఇప్పుడు ప్రగతి భవన్ విషయంలో కూడా అలాగే జరిగింది.