రజనీ కీర్తి కిరీటంలో అపూర్వ రత్నం ఫాల్కే!

రజనీ కీర్తి కిరీటంలో అపూర్వ రత్నం ఫాల్కే!

భారతీయ సినిమాకు సంబంధించి అత్యున్నత పురస్కారం అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనే చెప్పాలి. 1969 నుండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేస్తున్నారు. భారతీయ సినిమాకు పితామహునిగా నిలచిన దాదాసాహెబ్ దుండిరాజ్ గోవింద ఫాల్కే స్మారకార్థం ఈ అవార్డును ప్రవేశ పెట్టారు. భారతీయ చిత్రసీమలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డు 2019వ సంవత్సరానికి గాను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రకటించారు. రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటించడం పట్ల ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆనందిస్తున్నారు. పలువురు బీజేపీ నాయకులు సైతం రజనీకాంత్ వంటి గొప్పనటునికి రావలసిన అవార్డు ఇదని శ్లాఘిస్తున్నారు. రజనీకాంత్ కీర్తి కిరీటంలో అపూర్వరత్నంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నిలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2000లో రజనీకాంత్ కు పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ లభించాయి. ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు రజనీ దరి చేరింది. 

పలువురికి రజనీ స్ఫూర్తి!
చలనచిత్రసీమకు పలు సేవలు అందించిన వారిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించడం ఓ సత్ సంప్రదాయం. చిత్రసీమలో ఇంతింతై వటుడింతై అన్న చందాన ఎదిగిన రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించడం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రజనీకాంత్ చిత్రసీమలో సూపర్ స్టార్ గా  వెలిగిన వైనాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎందరో సినిమా రంగంలో అడుగుపెట్టి నటులుగా రాణించారు. అలా పలువురికి ఆదర్శంగా నిలచిన రజనీకాంత్ ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం గర్వించదగ్గ విషయమే!

అన్న అభిమాని!
రజనీకాంత్ జీవితాన్ని చూస్తే, ఆయన ఒక్కోమెట్టు ఎక్కుతూ సూపర్ స్టార్ స్థాయికి చేరుకున్న తీరు ఎవరినైనా ఆకట్టుకోకమానదు. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్. మాతృభాష మరాఠీ. పుట్టింది, పెరిగింది కర్ణాటకలో. కండక్టర్ గా పనిచేసింది బెంగళూరులో. హీరోగా రాణిస్తోంది తమిళనాట. ఇలా రజనీకాంత్ కథే చిత్రంగా ఉంటుంది. నిజంగా ఓ సినిమానే తలపిస్తుంది. బెంగళూరులో కండక్టర్ గా పనిచేసే రోజుల్లో రజనీకాంత్ నాటి మేటి హీరోలందరి చిత్రాలనూ చూసి, వారిలాగా నటిస్తూ ఆనందించేవారు. బెంగళూరులో కన్నడ సినిమాలతో పాటు, తెలుగు, తమిళ, హిందీ, మళయాళ చిత్రాలూ ప్రదర్శితమయ్యేవి. పౌరాణికాల్లో యన్టీఆర్ ను విశేషంగా అభిమానించే రజనీకాంత్ సాంఘికాల్లో హిందీనటుడు శత్రుఘ్న సిన్హాను ఇష్టపడేవారు. యన్టీఆర్ ను 'అన్న'గా అభిమానించే రజనీకాంత్, తన  అభిమాన నటుడు యన్టీఆరేనని తమిళనాడులో సైతం పలుమార్లు చెప్పారు. 

ప్రేరణ కలిగించిన అంశం!
ఓ సారి తన అభిమాన హీరో శత్రుఘ్న సిన్హా షూటింగ్ నిమిత్తం బెంగళూరు వచ్చారని తెలిసి, ఆయనను కలుసుకోవడానికి పలు పాట్లు పడ్డారు రజనీ. చివరకు కలుసుకున్నాక శత్రుఘ్న సిన్హా రూపురేఖలు, ఆయన మాటతీరు చూసి ఆశ్చర్యపోయారు. శత్రుఘ్న వంటి అతిసామాన్యంగా కనిపించే వ్యక్తి హిందీ చిత్రసీమలో ఎలా రాణిస్తున్నారో అన్న ఆశ్చర్యం కలిగింది. అదే మాట తన మిత్రులతో అన్నారు రజనీ. వారందరూ నువ్వూ సినిమారంగంలో చేరితే అలా  రాణించవచ్చునని చెప్పారు. తాను దాచుకున్న సొమ్ము, మిత్రులు అందించిన సాయంతో శివాజీరావ్ చెన్నై చేరి అక్కడ దక్షిణచలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో చేరారు. అక్కడే దర్శకులు కె.బాలచందర్ దృష్టిని ఆకర్షించారు శివాజీ. ఆయన తాను తెరకెక్కించిన 'అపూర్వ రాగంగల్' చిత్రంలో శివాజీ పేరును కాస్తా రజనీకాంత్ గా మార్చి, ఓ కీలక పాత్రలో నటింప చేశారు. ఇందులో కమలా్ హాసన్, శ్రీవిద్య  ప్రధాన పాత్రధారులు. శ్రీవిద్య  భర్త పాత్రలో రజనీ నటించారు. 

తెలుగులో రజనీ!
'అంతులేని కథ' తరువాత బాలచందర్ తెరకెక్కించిన తెలుగు చిత్రం 'అంతులేని కథ'లో రజనీకాంత్, జయప్రదకు అన్నగా నటించి, తెలుగు సినిమారంగానికి పరిచయం అయ్యారు. ఆ తరువాత నుంచీ పలు చిత్రాల్లో బిట్ రోల్స్ కూడా చేశారు. "చిలకమ్మ చెప్పింది, తొలిరేయి గడిచింది, అన్నదమ్ముల సవాల్, ఆమెకథ" వంటి చిత్రాలలో రజనీకాంత్ కీలక పాత్రలు పోషించారు.  తన అభిమాన నటుడు యన్టీఆర్ తో కలసి 'టైగర్'లో నటించారు. తమిళనాట స్టార్ అనిపించుకున్న తరువాత కృష్ణతో కలసి "ఇద్దరూ అసాధ్యులే, రామ్ రాబర్ట్ రహీమ్" చిత్రాల్లో కీ రోల్స్  లో కనిపించారు. శోభన్ బాబు హీరోగా నటించిన 'జీవనపోరాటం'లో ఆయన తమ్మునిగా నటించారు రజనీకాంత్. 'అమ్మ ఎవరికైనా అమ్మ' చిత్రంలో రజనీ హీరోగా నటించగా, ఆయన మిత్రుడు మోహన్ బాబు ప్రతినాయక పాత్ర ధరించారు. అంతకు ముందు నుంచీ వారిద్దరి మధ్య  మైత్రి ఉండేది. మోహన్ బాబుతో 'పెదరాయుడు' సినిమా తీయించి, అందులో తానూ ఓ కీలక పాత్ర పోషించి, ఎంతగానో అలరించారు రజనీకాంత్. 'బాషా' తరువాత నుంచీ తెలుగునాట కూడా రజనీ చిత్రాలకు మంచి మార్కెట్ లభించింది. అప్పటి నుంచీ ఇప్పటి దాకా రజనీ నటించిన తమిళ చిత్రాలు ఒకేసారి తెలుగులోనూ విడుదలవుతూ వస్తున్నాయి. 

కమల్  సహకారం!
కమల్ హాసన్ అనేక చిత్రాల్లో సైడ్ కేరెక్టర్స్ వేశారు రజనీకాంత్. కమల్ , రజనీ మధ్య  మంచి స్నేహబంధం ఉంది. అందువల్ల కమల్ తన చిత్రాలలో మిత్రుడు రజనీకి ఏదో ఒక పాత్ర ఉండేలా చూసేవారు. అలాగే తన వద్దకు చేరిన  కొన్ని చిత్రాలను రజనీకాంత్ అయితే ఆ పాత్రకు బాగుంటాడని కమల్ సిఫారసు చేసేవారు. అలా సిఫారసు చేసిన కథతో రూపొందిన చిత్రమే 'భైరవి'. ఆ చిత్రంతోనే రజనీకాంత్ కు సోలో హీరోగా మంచి పేరు లభించింది. ఆ తరువాత నుంచీ రజనీ సోలో హీరోగానూ సక్సెస్ సాధిస్తూ ముందుకు సాగారు. తమిళ చిత్రాలలో నటిస్తూనే, తన దరికి చేరిన పలు పరభాషా చిత్రాల్లోనూ రజనీ అభినయించారు. తమిళనాట స్టార్ ఇమేజ్ వచ్చిన తరువాత ఇతర భాషల్లో నటించడం తగ్గించారు. కమల్ హాసన్ తో కలసి రజనీకాంత్ నటించిన "ఎత్తుకు పైఎత్తు, వయసు పిలిచింది, అందమైన అనుభవం, అల్లావుద్దీన్ అద్భుతదీపం"వంటి చిత్రాలు తెలుగువారినీ ఆకట్టుకున్నాయి. భారతీరాజా తొలి చిత్రం 'పదునారు వయదినిలే'లో కమల్ హీరోగా, రజనీ విలన్ గా నటించారు. వారిద్దరూ 'గిరఫ్తార్' హిందీ చిత్రంలో అమితాబ్ బచ్చన్ తో కలసి నటించారు. 1985లో విడుదలైన 'గిరఫ్తార్' వారిద్దరూ కలసి నటించిన ఆఖరి చిత్రం. గత మూడు దశాబ్దాలుగా రజనీ, కమల్ కలసి నటించే సినిమా అప్పుడు, ఇప్పుడు అంటూనే  కాలం కరిగిపోయింది. ప్రస్తుతం కమల్ హాసన్ తన రాజకీయ పార్టీ 'మక్కల్ నీతిమయం'తో ఎన్నికల బరిలో ఉన్నారు. రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి వస్తానని,  పార్టీ పెడతానని ప్రకటించి, విరమించుకున్నారు. 

పూలు...ముళ్ళు... 
రజనీకాంత్ తన నటజీవితంతో ఎంతోమందికి స్పూర్తి కలిగించారు. తమిళ సినిమాను దేశవిదేశాల్లో వెలిగిపోయేలా చేసిన వారిలో రజనీ స్థానం ప్రత్యేకం. అలాంటి రజనీకాంత్ కు ప్రతిష్టాత్మకమైన అవార్డులు లభించిన ప్రతీసారి విమర్శలూ వినిపించాయి. రజనీలాంటి మాస్ హీరో రాజకీయాల్లోకి వస్తే, విజయం సాధిస్తారని, ఆయనతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న పార్టీలు ఆశించేవి. 2000లో నేరుగా ఆయనకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చినప్పుడూ అలాంటి విమర్శలే వినిపించాయి. 2016లో పద్మవిభూషణ్ అందించిన సమయంలోనూ సదరు విమర్శలే తలెత్తాయి. ప్రస్తుతం తమిళనాట ఎన్నికలు జరుగుతున్న సమయంలో రజనీకాంత్ కు కేంద్రంలోని బీజేపీ ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం పట్ల కూడా అదే తీరున విమర్శలు వెలువెత్తడంలో విశేషమేముంది? పైగా, రజనీకి ఈ అవార్డు ప్రకటించిన వెంటనే బీజేపీ కేంద్రనాయకులే అభినందిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం కూడా ఈ విమర్శలకు మరింత ఊతమిస్తోంది. అవన్నీ పక్కకు పెడితే రజనీకాంత్ కీర్తి కిరీటంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వంటి రత్నం చేరడం సినీ అభిమానులకు ఆనందం కలిగిస్తోంది.