అక్కినేని అభినయ వైభవం 'ప్రేమాభిషేకం'

అక్కినేని అభినయ వైభవం 'ప్రేమాభిషేకం'

నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటజీవితంలో ఓ మరపురాని చిత్రం 'ప్రేమాభిషేకం'... ఫిబ్రవరి 18తో 'ప్రేమాభిషేకం' సినిమా 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది...  విషాదాంత ప్రేమకథలతో  పలుమార్లు విజయం సాధించారు ఏయన్నార్... అలాంటి చిత్రాలలో ఆయన అభినయాన్ని చూసి అభిమానిగా మారారు దాసరి నారాయణరావు... అక్కినేని, దాసరి కాంబోలో ట్రాజిక్ ఎండింగ్ తో రూపొంది అనూహ్య విజయం సాధించింది 'ప్రేమాభిషేకం'.

ఆ పాత్రలకు ఆయనే!
తెలుగు చిత్రసీమలో విషాదాంత ప్రేమకథలకు పెట్టింది పేరు అక్కినేని అభినయం... సుప్రసిద్ధమైన విషాద ప్రేమకథలుగా లైలా-మజ్ను, సలీమ్-అనార్కలి, దేవదాసు- పార్వతి నిలిచాయి... ఈ మూడు కథలతో  రూపొందిన చిత్రాలలోనూ ఏయన్నార్ నటించి అలరించారు... ఆయనను ట్రాజెడీ కింగ్ గా నిలిపిన చిత్రం 'దేవదాసు' అనే చెప్పాలి... ఆ సినిమా చూసి, అక్కినేని అభిమానిగా మారిన దాసరి నారాయణరావు ఈ 'ప్రేమాభిషేకం' చిత్రానికి దర్శకత్వం వహించారు... ఈ సినిమా అన్నపూర్ణ సినీస్టూడియోస్ పతాకంపై వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని నిర్మాతలుగా తెరకెక్కింది... ఏయన్నార్, దాసరి ఇద్దరి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా 'ప్రేమాభిషేకం' నిలచింది... 

అభిమాని అందించిన కానుక!
నిస్సందేహంగా ఏయన్నార్ కు అసలు సిసలు అభిమాని దాసరి నారాయణరావు... తన అభిమాన నటునితో తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రానికి 'దేవదాసు' ప్రేరణతోనే కథ రాసుకున్నారు... దానికి  'దేవదాసు మళ్ళీ పుట్టాడు' అనీ పేరు పెట్టారు... ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది... ఆ తరువాత నుంచీ తన అభిమాన నటుణ్ణి మళ్ళీ  గ్రాండ్ సక్సెస్ రూటులో నిలపాలని ప్రయత్నాలు చేశారు దాసరి... అందులో అతి పెద్ద విజయాన్ని అందించిన చిత్రం 'ప్రేమాభిషేకం'... కావున, ఇది అక్కినేనికి అభిమాని అందించిన కానుకగానూ 'ప్రేమాభిషేకం' నిలచింది. 

ప్రియురాలి కోసం...
'ప్రేమాభిషేకం' చిత్ర కథను చూస్తే, అంతకు ముందు ఏయన్నార్ నటించిన కొన్ని ప్రేమకథా చిత్రాలు, వాటిలోని సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి ప్రేమను పొందడానికి హీరో పలు వేషాలు వేస్తాడు. చివరకు అతనిది నిజమైన ప్రేమ అని తెలుసుకున్న నాయిక కూడా అతణ్ణి ప్రేమిస్తుంది. తరువాత హీరోకు కేన్సర్ అని తెలుస్తుంది. తన కారణంగా ప్రేయసి జీవితం అంధకారం కాకూడదని భావించిన హీరో, ప్రియురాలు తనను ఏవగించుకొనేలా చేస్తాడు. పంతం పట్టి ఆమె మరొకరిని పెళ్ళాడేలా చేసి, కన్నుమూస్తాడు. ఈ విషాద ప్రేమకథను దాసరి తనదైన రీతిలో తెరకెక్కించి ఆకట్టుకున్నారు.

మ్యూజికల్ హిట్
'ప్రేమాభిషేకం' చిత్రానికి దాసరి నారాయణరావు, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం చేసి ఆకట్టుకున్నారు...ఈ చిత్రంలోని ఏడు పాటలనూ ఆయనే రాశారు... అన్నీ విశేషాదరణను చూరగొన్నాయి... ఇక ఈ చిత్రానికి చక్రవర్తి స్వరకల్పన పెద్ద ఎస్సెట్ గా నిలిచింది... ఆ రోజుల్లో 'ప్రేమాభిషేకం' ఆడియో విశేషాదరణ చూరగొంది... ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గానూ జనాన్ని మురిపించింది... "ఆగదు...ఆగదు..." పాట, "వందనం అభివందనం..." సాంగ్, "తారలు దిగివచ్చిన వేళ..." గీతం ఎస్పీ బాలు గళంలో జాలువారి విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక "కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా..." పాట, "నా కళ్ళు చెబుతున్నాయి..." అని సాగే గీతం, "దేవీ మౌనమా..." అంటూ మొదలయ్యే పాట స్టెప్స్ తో అలరించాయి. "ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం..." పాట హృదయాలను హత్తుకుంది. 

ఉత్తమనటిగా జయసుధ
'ప్రేమాభిషేకం' చిత్రంలో జయసుధ, శ్రీదేవి, పుష్పలత, కవిత, నిర్మలమ్మ, ప్రభాకర్ రెడ్డి, గుమ్మడి, మురళీమోహన్, మోహన్ బాబు, పద్మనాభం, మాడా తదితరులు నటించారు. ఎవరి పాత్రల్లో వారు ఒదిగిపోయి అభినయించారు. అందరికీ ఈ సినిమా మంచిపేరు సంపాదించి పెట్టింది. ముఖ్యంగా జయసుధకు ఉత్తమనటిగా నంది అవార్డు లభించింది. 

పదేళ్ళ  తరువాత
ఏయన్నార్ నటజీవితంలో 'ప్రేమాభిషేకం' చిత్రానికి ముందు కూడా అనేక మరపురాని చిత్రాలు ఉన్నాయి... అవి ఈ నాటికీ అభిమానులకు ఆనందం పంచుతూనే ఉండడం విశేషం... అయితే ఈ సినిమాకు ముందు ఏయన్నార్ కు బ్లాక్ బస్టర్ గా నిలచిన చిత్రం 'దసరాబుల్లోడు' అనే చెప్పాలి. 1971లో ఆ సినిమా విడుదలయింది. ఆ సినిమా తరువాత కూడా ఏయన్నార్ కు పలు సక్సెస్ లు ఉన్నా, ఆ స్థాయిలో అలరించిన చిత్రం మరొకటి కానరాదు... మళ్ళీ  పదేళ్ళకు అంటే 1981లో 'ప్రేమాభిషేకం' ఏయన్నార్ కు అంతటి విజయాన్ని అందించింది... అందుకనే ఈ సినిమా అభిమానులకు ఓ ప్రత్యేకం!

ఆరంభం... విడుదల... 
'ప్రేమాభిషేకం' 1981 ఫిబ్రవరి 18న విడుదలయింది...ఆ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది - అదేమిటంటే అన్నపూర్ణమ్మతో అక్కినేని వివాహం జరిగిన తేదీ అది... అందువల్ల ఆ తేదీనే 'ప్రేమాభిషేకం'ను విడుదల చేయాలని సంకల్పించారు.. ఇక ఈ చిత్రం ఏయన్నార్ పుట్టినరోజయిన సెప్టెంబర్ 20న 1980లో ప్రారంభమయింది. అందుకనే తొలి సీన్ ను శ్రీదేవికి బర్త్ డే విషెస్ చెబుతూ అక్కినేని బొకే ఇచ్చే సీన్ తీశారు. అందులో ఈ రోజు నా పుట్టినరోజు అని కూడా ఆయన నోట పలికించారు దాసరి. ఇలా లెక్కలు వేసుకొని తీసిన ప్రేమాభిషేకం అక్కినేని, దాసరి ఊహించినట్టుగానే  అనూహ్య విజయం సాధించింది. 

మొదట్లో అలా... ఆ తరువాత అలా అలా...
'ప్రేమాభిషేకం' చిత్రం విడుదల రోజున అభిమానులు సినిమా భలేగా ఉందన్నారు... కొందరు ఫరవాలేదన్నారు... మరికొందరు ఏడుపు గొట్టు చిత్రం అనీ తేల్చేశారు... ఈ డివైడ్ టాక్ రావడానికి కారణం, తెలుగు చిత్రసీమలో ఆ సమయాన హీరో,హీరోయిన్ సుఖాంత ప్రేమకథలు, లేదా జనరంజకమైన కుటుంబకథలు రూపొంది విజయబావుటా ఎగురవేస్తున్నాయి... సరిగ్గా అప్పుడే  'ప్రేమాభిషేకం' రెగ్యులర్ మూవీస్ కంటే భిన్నంగా జనం ముందు నిలచింది...పైగా ఏయన్నార్ కు అచ్చివచ్చిన విషాదాంత ప్రేమకథ. మెల్లగా రెండు వారాల తరువాత సినిమా ఊపందుకుంది... ఇట్టే జనం మదిని దోచేసింది... ఆరంభంలో 'హౌస్ ఫుల్స్' చూడని కేంద్రాలలోనూ తరువాతి రోజుల్లో వరుసగా 'హౌస్ ఫుల్స్' చూస్తూ సాగింది... 

ఏయన్నార్ కు తొలి కోటి రూపాయల చిత్రం!
ఏయన్నార్ నటజీవితంలో తొలిసారి కోటి రూపాయలు వసూలు చేసిన చిత్రంగా 'ప్రేమాభిషేకం' నిలచింది... అంతేకాదు, అప్పటి దాకా అన్నపూర్ణ సినీస్టూడియోస్ ను నడపడానికి ఏయన్నార్ పలు విధాలా శ్రమించారు... తమ అన్నపూర్ణ సినీస్టూడియోస్ పతాకంపై ఇతరులతో చిత్రాలు నిర్మించారు... తానే హీరోగా నటించారు... మరికొన్ని సంస్థలతో కలసి చిత్రాలనూ తీశారు... ఏదో అలా అలా సాగుతూ ఉండేది... 'ప్రేమాభిషేకం' విజయంతో స్టూడియో లాభాల బాట పట్టిందని చెప్పాలి.

రికార్డుల మోత!
ఫస్ట్ రిలీజ్ లోనే 30 కేంద్రాలకు పైగా వందరోజులు ఆడిన సినిమాగా అంతకు ముందు యన్టీఆర్ 'అడవిరాముడు' చరిత్ర సృష్టించింది... ఆ రికార్డును ఈ సినిమా బద్దలు చేస్తుందని భావించారు... అయితే తొలి విడుదలలో 'ప్రేమాభిషేకం' 30 కేంద్రాలలోనే వందరోజులు చూసింది... కానీ, చిత్రంగా 'ప్రేమాభిషేకం' సిల్వర్ జూబ్లీస్ లో రికార్డు సృష్టించింది. ఈ సినిమా 16 కేంద్రాలలో డైరెక్టుగా సిల్వర్ జూబ్లీ ఆడింది. మూడు కేంద్రాలలో షిఫ్ట్ పై రజతోత్సవం చేసుకుంది. పది కేంద్రాలలో ఉదయం ఆటలతో 175 రోజులు పూర్తి చేసుకుంది. అలా మొత్తం 29 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ చూసిన తొలి చిత్రంగా నిలచింది. 

తొలి ప్లాటినమ్ జూబ్లీ!
అంతకు ముందున్న పలు రికార్డులను 'ప్రేమాభిషేకం' తుడిచేసింది... షిఫ్టులు, ఉదయం ఆటలు కలిపి 16 కేంద్రాలలో రెండు వందల రోజులు చూసింది... నాలుగు కేంద్రాలలో రెగ్యులర్ షోస్ తోనూ, మరో నాలుగు కేంద్రాలలో ఫిఫ్టులతో, మార్నింగ్ షోస్ తోనూ కలిపి ఎనిమిది సెంటర్లలో సంవత్సరం ఆడింది. గుంటూరు విజయా టాకీస్ లో ఏకధాటిగా 380 రోజులు ప్రదర్శితమై తెలుగునాట తొలి డైరెక్ట్ గోల్డెన్ జూబ్లీ సినిమాగా నిలచింది. హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలో షిఫ్టులపై 75 వారాలు పూర్తి చేసుకుంది. అలా మొదటి ప్లాటినమ్ జూబ్లీ మూవీగానూ రికార్డ్ సృష్టించింది. లేట్ రిలీజులతో కలిపి మొత్తం 42 కేంద్రాలలో శతదినోత్సవం చూసింది.  ఏది ఏమైనా తెలుగునాట ఓ విషాదాంత ప్రేమకథా చిత్రం ఇంతటి విజయాన్ని సాధించడం మళ్ళీ  జరగలేదు. మరలా  ఏయన్నార్ నటజీవితంలోనూ ఈ స్థాయి ఘనవిజయం ఆయన దరి చేరలేదు. అందుకే అభిమానులకు 'ప్రేమాభిషేకం' ఓ ప్రత్యేకం. అక్కినేని అభిమానులకు మరపురానిది, మరువలేనిది 'ప్రేమాభిషేకం'.