40 ఏళ్ళ  'ఊరికి మొనగాడు'

40 ఏళ్ళ  'ఊరికి మొనగాడు'

నటశేఖర కృష్ణ నటజీవితంలో ఓ మరపురాని చిత్రం 'ఊరికి మొనగాడు'. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో గోపీ మూవీస్ పతాకంపై ఎ.గోపాలకృష్ణ నిర్మించిన చిత్రమిది. ఇది కృష్ణ నటజీవితంలో ఎందుకు ప్రత్యేకమైనది అంటే - అంతకు ముందు కృష్ణ నటించిన చిత్రాలలో సూపర్ హిట్ గా నిలచిన 'పండంటికాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు' అన్నీ ఆయన సొంత చిత్రాలే. 'తన సొంత చిత్రాలు కాకుండా ఏడు కేంద్రాలలో డైరెక్టుగా హండ్రెడ్ డేస్ ఆడిన బయటి చిత్రం 'ఊరికి మొనగాడు'' అని కృష్ణ స్వయంగా ఈ సినిమా శతదినోత్సవంలో సెలవిచ్చారు. అందువల్ల 'ఊరికి మొనగాడు' చిత్రం కృష్ణకు, ఆయన అభిమానులకు అమితానందం పంచిన సినిమాగా నిలచిందని చెప్పవచ్చు. 

కృష్ణతో రాఘవేంద్రుని మూడో చిత్రం!
'ఊరికి మొనగాడు'కు ముందు రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ నటించిన "భలే కృష్ణుడు, ఘరానాదొంగ" చిత్రాలు సైతం పాటలతో అలరించాయి. అయితే అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి. అయినా అప్పటికే రాఘవేంద్రరావు అదిరిపోయే హిట్స్ తో సాగుతున్నారు. ఇక ఆయన పాటల చిత్రీకరణ అంటే జనానికి విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ సమయంలో కృష్ణ హీరోగా రాఘవేంద్రరావు సినిమా అనగానే అభిమానుల మది ఆనందంతో చిందులువేసింది. వారి అంచనాలకు తగ్గట్టుగానే కృస్ణను 'ఊరికి మొనగాడు'గా తీర్చిదిద్దారు రాఘవేంద్రరావు. 1981 జనవరి 14న సంక్రాంతి సంబరాల్లో విడుదలైన 'ఊరికి మొనగాడు' అనూహ్య  విజయం సాధించింది. 

ఆకట్టుకొనే అంశాలు
'ఊరికి మొనగాడు' కథ విషయానికి వస్తే - కృష్ణ కష్టపడి ఇంజనీరింగ్ చదివి ఊరికి వస్తాడు. తన కుటుంబానికి మేనమామనే తీరని అన్యాయం చేశాడన్న విషయం తెలుస్తుంది. దాంతో మేనమామను, ఆయన పొగరుబోతు కూతురును దారికి తెచ్చి  ఊరికి మొనగాడు అనిపించుకుంటాడు. ఈ తరహా కథలు తెలుగువారికి కొత్తకాదు. కానీ, ఈ కథను రాఘవేంద్రరావు ఆద్యంతం ఆసక్తికరంగా మలచిన తీరు ఆకట్టుకుంటుంది. సత్యానంద్ రచనతో రూపొందిన ఈ కథకు రాఘవేంద్రరావు స్క్రీన్‌ ప్లే తోడయింది. ఈ చిత్రంలో ఇంజనీర్ కృష్ణగా కృష్ణ కనిపించారు. హీరో మేనమామ కూతురుగా జయప్రద నటించారు. ఇక ఇందులో రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య మధ్య సాగే సంభాషణలు కితకితలు పెడతాయి. ముఖ్యంగా ఊళ్ళ పేర్లతో రామలింగయ్య నోట సాగే మాటలు మరింతగా ఆకట్టుకుంటాయి. 

తెలుగులో జయప్రద... హిందీలో శ్రీదేవి...
'ఊరికి మొనగాడు' చిత్రంలో చంద్రమోహన్, కాంతారావు, ప్రసాద్ బాబు, మాడా, గీత, రాజ్యలక్ష్మి,  పుష్పలత, నిర్మల,ఝాన్సీ,, శ్యామల, చలపతిరావు తదితరులు నటించారు. మూగవాడి పాత్రలో చంద్రమోహన్ నటన ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి వేటూరి, ఆరుద్ర పాటలు రాయగా చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఇందులోని పాటలన్నీ జనాన్ని విశేషంగా అలరించాయి. ముఖ్యంగా "కదలిరండి మనుషులైతే..." సాంగ్ జనాన్ని ఉత్తేజ పరుస్తుంది. 'అందాల జవ్వనీ...రాగాల పువ్వనీ...' , 'బూజంబంతి బూజంబంతి పువ్వో పువ్వో...', 'మొగ్గ పిందేల నాడే...', 'ఇదిగో తెల్లచీర...' పాటల చిత్రీకరణ జనాన్ని చిందులు వేయించింది. ఇదే చిత్రాన్ని హిందీలో కృష్ణ 'హిమ్మత్వాలా' పేరుతో జితేంద్ర హీరోగా నిర్మించారు. తెలుగులో జయప్రద పోషించిన పాత్రను హిందీలో శ్రీదేవి ధరించింది. ఈ హిందీ చిత్రానికి కూడా కె.రాఘవేంద్రరావు దర్శకుడు. ఆ సినిమాతోనే హిందీలో శ్రీదేవికి హీరోయిన్ గా బ్రేక్ లభించింది. 

టైటిల్ లో తేడా...
'ఊరికి మొనగాడు' చిత్రం ఆ యేడాది సంక్రాంతి రోజున విడుదలయిన చిత్రాలలో మేటిగా నిలచింది. ఈ చిత్రం 11 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. అందులో ఏడు కేంద్రాలలో డైరెక్టుగా, మిగిలిన నాలుగు సెంటర్లలో షిఫ్ట్ మీద నడిచింది. రజోత్సవం జరుపుకుందీ చిత్రం. ఆ యేడాది కృష్ణకు బిగ్ హిట్ గా నిలచింది. ఆయన అభిమానులను విశేషంగా అలరించింది. ఇంత విజయం సాధించిన 'ఊరికి మొనగాడు' టైటిల్స్ లో 'ఊరుకి మొనగాడు' అని ఉంటుంది. అది వ్యాకరణ దోషమని పండితులు అన్నారు. సినిమా మాత్రం జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది.